ఈసారి నన్ను నమ్మండి: కేజ్రివాల్, తానే అభ్యర్థినని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి తానే ప్రధాన వ్యక్తిగా ఉంటానని, అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తానే ఉంటానని సూచనప్రాయంగా తెలియజేసారు.
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అవినీతిని అంతమొందిస్తామని, స్వచ్ఛమైన పాలనను అందిస్తామన్న హామీతో పోటీ చేసిన ఆ పార్టీ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 28 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టారు.
ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిలో మార్పు ఉండాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త తరహా ఎన్నికల ప్రచారంతో పార్టీ ప్రజలను ఆకట్టుకునేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన కేజ్రీవాల్ ఈసారి కూడా తానే ఎన్నికల ప్రచార సారథిగా ఉంటానని చెప్పారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందన్న ధీమాను కేజ్రీవాల్ వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి 47 శాతం ఓట్లు, బిజెపికి 37 శాతం ఓట్లు వస్తాయని నెలన్నర క్రితం నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయిందని చెప్పారు.
‘మా పార్టీ అధికారంలో ఉన్న ఆ 49 రోజుల పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అది ప్రజల పాలిట కలల రాజ్యం. అందుకే ఈసారి వాళ్లు మాకే ఓటు వేస్తారు. మాకు స్పష్టమైన మెజారిటీ లభిస్తుందన్న గట్టి నమ్మకం ఉంది' అని కేజ్రీవాల్ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే 49 రోజులు పాలించిన తర్వాత ప్రభుత్వం నుంచి వైదొలగడం తన రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం గద్దెదిగిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ తప్పుగా అంచనా వేసిందని చెప్పారు. ‘రాజీనామా చేయడం పెద్ద తప్పే. ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వారి ఆశలన్నీ పటాపంచలైనాయి. మేము రాజీనామా చేసిన తర్వాత వెంటనే ఎన్నికలు జరుగుతాయని మేము అనుకున్నాం' అని కేజ్రివాల్ అన్నారు. ఈసారి ఢిల్లీ ప్రజలు తమను నమ్మాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications