బెంగళూరుకు భారీ వరాల మూట- కర్ణాటక బడ్జెట్ హైలైట్స్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆయన సభలో ప్రవేశపెట్టడం ఇది 17వ సారి. ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు. ఈ ఉదయం రాష్ట్ర మంత్రివర్గం 4.48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించింది. గ్యారంటీ పథకాలతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 56,432 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని సిద్ధరామయ్య ప్రకటించడం నిరుద్యోగులకు శుభవార్తే. పాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలక విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఈ సంవత్సరం 56,432 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. కోర్టు కేసుల వల్ల నియామకాలలో అయిన ఆలస్యాన్ని గుర్తించి, వయోపరిమితిలో ఒకేసారి అయిదేళ్ల సడలింపు ఇచ్చామని స్పష్టం చేశారు.

ఈ బడ్జెట్‌లో గ్రేటర్ బెంగళూరు అథారిటీకి గణనీయమైన నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. బెంగళూరు అభివృద్ధి నిధులు బడ్జెట్ లో రూ. 7,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో ఈ నిధులు రూ. 3,000 కోట్లకే పరిమితమైంది. రోడ్ల అభివృద్ధిలో భాగంగా అయిదు నగర పాలికల పరిధిలో వార్డు స్థాయిలో 1,255 కోట్లతో రోడ్లు, మౌలిక వసతుల కల్పించనున్నారు. 158 కిలోమీటర్ల రోడ్లకు 1,700 కోట్లతో 158 కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్ పనులు చేపట్టనున్నారు.
బెంగళూరు పరిధిలో ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి 1,936 కోట్లను కేటాయించారు. అలాగే అత్యంత రద్దీగా ఉండే సిల్క్ బోర్డు జంక్షన్ నుండి కేఆర్ పురం మెట్రో స్టేషన్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రూ. 450 కోట్లు మంజూరు చేశారు. రాబోయే మూడేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా రోడ్లను 3,000 కోట్ల వ్యయంతో వైట్ టాపింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నగర పాలక సంస్థలు తమ సొంత నిధులతో తదుపరి మూడేళ్లలో 175 జంక్షన్లను సుందరీకరించాల్సి ఉంటుంది. అలాగే 500 కిలోమీటర్ల పాదచారుల మార్గాలను మెరుగుపరచడం, 100 స్కైవాక్‌లను నిర్మించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు సిద్ధరామయ్య. వీటికి అవసరమైన నిధులను అయిదు నగర పాలక సంస్థలు సొంతంగా సమకూర్చుకుంటాయని తెలిపారు. దీనికోసం మునిసిపల్ బాండ్'లను జారీ చేయడం ద్వారా అభివృద్ధి పనులకు నిధులను సమీకరించుకోవచ్చు.
2027 చివరి నాటికి కొత్త సవరించిన మాస్టర్ ప్లాన్-2041, ఆరు నెలల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. రాజ కాలువల ఆధునీకరణ, చెరువుల అభివృద్ధి పనులకు రూ. 273 కోట్లు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలు చేస్తున్న జల భద్రత, విపత్తు నిరోధక కార్యక్రమం కింద, రాజ కాలువల అభివృద్ధి, ఆధునీకరణకు రూ. 2,000 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించామని గుర్తు చేశారు.
నమ్మ మెట్రో ప్రాజెక్ట్ విస్తరణ కోసం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 కిలోమీటర్ల అదనపు మార్గాలను పూర్తి చేయాలని, దీనివల్ల రోజుకు 15 లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యం లభించనుందని సిద్ధరామయ్య ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు మెట్రో వయాడక్ట్ పొడవునా తొమ్మిది కిలోమీటర్ల పాదచారుల మార్గాన్ని 160 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు కంపెనీల సంఘం (ORRCA) దీనికి నిధులు సమకూర్చనుందని చెప్పారు.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి బెంగళూరు బిజినెస్ కారిడార్ భాగం-1 నిర్మాణాన్ని చేపట్టామని సిద్ధరామయ్య చెప్పారు. తుమకూరు రోడ్డు నుండి హోసూర్ రోడ్డు వరకు 73 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంటుందని, దీనికి భూసేకరణ పనులు కొనసాగిస్తూనే మరోవంక స్థలాన్ని కోల్పోయే వారికి పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ రహదారిని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ట్రాఫిక్ నియంత్రణకు బెంగళూరులో భారీ సొరంగ మార్గాల నిర్మాణాన్ని చేపట్టామని, హెబ్బాల్ జంక్షన్ నుండి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సిల్క్ బోర్డు వరకు నార్త్-సౌత్ కారిడార్, కేఆర్ పురం నుండి మైసూరు రోడ్డు వరకు ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లను నిర్మిస్తామని అన్నారు. మొత్తం 40 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గాలను 40,000 కోట్ల అంచనా వ్యయంతో బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ నమూనాలో ఉంటుందని వివరించారు సిద్ధరామయ్య.
మొదటి దశలో 17 కిలోమీటర్ల నార్త్- సౌత్ కారిడార్‌ను రూ. 17,780 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించామని ఆయన తెలిపారు. నగర రద్దీని తగ్గించడానికి నెలమంగళ-తావరకెరె-బిడది మధ్యంతర రింగ్ రోడ్డును డెవలప్ చేస్తోన్నామని, ముఖ్యమంత్రి అమృత్ నగరోత్థాన పథకం ఫేజ్-4 కింద మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం రూ. 3,885 కోట్లు కేటాయించామని వివరించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,716 కోట్లను విడుదల చేశామని, ఈ ఏడాది మరో రూ. 500 కోట్లను మంజూరు చేస్తామని అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications