ప్రియాంకతో సహా ఎవర్నీ అలా చూడొద్దు: బీజేపీ ఎమ్మెల్యేపై సీఎం
బెంగళూరు: శాసన సభ సమావేశాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చవాన్ తన ఫోన్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చిత్రాన్ని చూడటం పైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. చట్టసభల్లో అమ్మాయిల ఫోటోలను చూడటం వారి సంస్కృతి అని ఎద్దేవా చేశారు.
ప్రియాంక గాంధీతో సహా ఏ అమ్మాయిని కూడా అలా చూడటం సరికాదన్నారు. ఇంతకుముంచి తాను ఏమీ చెప్పదల్చుకోలేదన్నారు. శాసన సభలోకి సెల్ ఫోన్లను అనుమతించడం, అనుమతించక పోవడం సభాపతి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

వినూత్న నిరసన
బుధవారం ఉదయం శాసన సభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభు చవాన్ తన నియోజకవర్గంలో అనర్హత పేరుతో పేదల బీపీఎల్ కార్డులను రద్దు చేస్తోందని ఆరోపిస్తూ గంపలో కొన్ని బీపీఎల్ కార్డులను వేసుకొని సభలోకి ప్రవేశించారు. విషయం గమనించిన సభాపతి తిమ్మప్ప ఇలా చేయడం తగదని హితవు పలికారు.
అప్పటికి మిన్నకుండిపోయిన ప్రభు చవాన్ కొంత సమయం తర్వాత రద్దయిన బీపీఎల్ కార్డులను తన దుస్తుల పైన పిన్నీలు, ప్లాస్టర్ సహాయంతో అతికించుకొని నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన సభాపతి శాసన సభలో సమస్యల ప్రస్తావన హుందాగా ఉండాలన్నారు. అలాగే ప్రవర్తించాలనుకుంటే బయటకు వెళ్లిపోవాలన్నారు.
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చవాన్ సెల్ ఫోన్లో ప్రియాంక గాంధీ చిత్రం చూసిన విషయం తెలిసిందే. అంతేకాదు పక్కనున్న మరో ఎమ్మెల్యే రవి సుబ్రహ్మణ్యానికి చూపారు. దీనిపై ప్రభు చవాన్ వివరణ ఇస్తూ.. స్మార్ట్ ఫోన్లో వచ్చిన సందేశాన్ని చూసే క్రమంలో ప్రియాంక ఫోటో చూమ్ చేసానని, అది ఎక్కడికో పోయిందని, కావాలనే ఆ పని చేయలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications