తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రయం: ఢిల్లీపై సిమి గురి
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రయం పొంది సిమి ఉగ్రవాదులు ఢిల్లీపై దాడులకు పథకం వేసినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్‌కౌంటర్ సంఘటనలు అందుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో లేదా దాని పరిసరాల్లో విధ్వంసం సృష్టించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఉగ్రవాదులు తరుచూ రాకపోకలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
జానకీపురం ఎన్‌కౌంటర్ స్థలంలో లభించిన రైలు, బస్సు టికెట్లు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సీమీ కార్యకర్తలు కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన పునాదిని ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దానికితోడు, తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండలో వారికి పెద్ద సంఖ్యలో సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.
సూర్యాపేటలో కాల్పులు జరిపినవారు, జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మరణించినవారు సిమీ కార్యకర్తలనే విషయాన్ని దర్యాప్తు అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మరణించిన అస్లాం, ఎజుజుద్దీన్‌లు సిమీ కార్యకర్తలనే విషయాన్ని కూడా వారు ధ్రువీకరించుకున్నారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. విజయవాడ, హైదరాబాదులను కేంద్రాలుగా చేసుకుని ఢిల్లీని టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు సిమీ కార్యకర్తలను పరిశీలించడానికి వచ్చిన ఎన్ఐఎ అధికారులు తెలంగాణ పోలీలు అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్, విజయవాడ మధ్య వారు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. స్తానికంగా వారికి సానుభూతిపరులు ఉండడంతో వారికి అది సాధ్యమైందని అనుకుంటున్నారు.
ఉగ్రవాదుల శవాల వద్ద పోలీసులకు శనివారంనాడు ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో బుక్ చేసుకున్న రైలు టికెట్‌తో పాటు మార్చి 28వతేదీన విజయవాడకు వెళ్లిన, 29వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాదుకు వచ్చిన బస్సు టికెట్లు కూడా లభించాయి. ఉగ్రవాదులు రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉండి ఏప్రిల్ 1వ తేదీన విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో పోలీసులకు తారసపడ్డారు. దీన్ని బట్టి ఉగ్రవాదులు తరుచుగా విజయవాడ, హైదరాబాదు మధ్య సంచరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు ఇలా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నల్లగొండ ఆయువుపట్టు...
నల్లగొండలో సిమీకి మంచి పట్టు ఉందని, దాదాపు 40 నుంచి 45 మంది సానుభూతిపరులు ఉన్నారని తెలంగాణ నిఘా విభాగం కనిపెట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు దోపిడీ, మెదక్ జిల్లా రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకీ సానుభూతిపరులు సహకరించినట్లు చెబుతున్నారు. ఇలాంటి దోపిడీల ద్వారా ఢిల్లీ విధ్వంసానికి ఆర్థిక వనరులను సమకూర్చునే పనిలో ఉగ్రవాదులు పడినట్లు అనుమానిస్తున్నారు.

సూర్యాపేటలో కాల్పులు జరిపి పారిపోవడానికి ముందు సిమీ ఉగ్రవాదులు హైదరాబాదులో ఎక్కడ ఆశ్రయం పొందారనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గత అక్టోబర్ నెలలో సిమీ మాజీ చీఫ్ సయ్యద్ సల్లావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియల కార్యక్రమంపై కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు.
హైదరాబాద్‌కు చెందిన మాజీ కార్యకర్తలు మొతసిమ్, అబు సయీఫ్, కమ్రాన్ షాలు సిమితో కలిసి ఇప్పటికీ పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాదులో ముదస్సిర్, షోయబ్ చెప్పిన వివరాల ప్రకారం - హైదరాబాద్, మహారాష్ట్ర, ఔరంగాబాద్, కోల్‌కతా సిమీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు.
రెండు ప్రత్యేక ఉగ్రవాద బృందాలు
రెండు ప్రత్యేక ఉగ్రవాద బృందాలు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో హైదరాబాదుకు వచ్చినట్లు భావిస్తున్నారు. అస్లాం, మరో ఇద్దరు నాలుగు రోడుల పాటు హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాల్లో సంచరించినట్లు కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల అధికారులు గుర్తించినట్లు సమాచారం. సిమీ సానుభూతిపరులు ఉంటున్న సంతోష్‌నగర్, డబీర్‌పురా ప్రాంతాలపై పోలీసుల నిఘా ఉండడంతో ఈ ఉగ్రవాదులు అక్కడికి వెళ్లకుండా పాతబస్తీలో రెండు చోట్ల, పశ్చిమ మండలం పోలీసుల పరిధిలో ఒక చోట, హైదరాబాదు పరిధిలో మరో చోట రాత్రుళ్లు తలదాచుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications