2బస్సులు ఢీ: 8మంది మృతి, 15మందికి గాయాలు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లతోపాటు 8మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు.
బెంగళూరు నుంచి షిమోగా వెళుతున్న రాష్ట్ర ఆర్టీసి బస్సును ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఓవర్ టేక్ సమయంలో మరో బస్సును గమనించకపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బెంగళూరులోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

అతివేగం, డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఆరుగురు షిమోగాకు చెందిన వారు కాగా, ఒకరు బెంగళూరు, మరొకరు తమిళనాడుకు చెందిన వారున్నారని చెప్పారు.
కర్ణాటక రవాణా శాఖ మంత్రి ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications