Sonia Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్-నెహ్రూ కుటుంబం నుంచి రెండో వ్యక్తి..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ లోక్ సభకు మాత్రమే పోటీ చేసి గెలుస్తూ వస్తున్న సోనియా ఈసారి మాత్రం ఆరోగ్య కారణాలతో రాజ్యసభకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పిల్లలు రాహుల్, ప్రియాంక, ఇతర నేతలతో కలిసి జైపూర్ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటుకు జరుగుతున్న ఎన్నికల్లో సోనియా గాంధీ ఈసారి బరిలోకి దిగుతున్నారు. రాజస్తాన్ లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్ధానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంది. దీంతో సోనియా గాంధీ ఈ సీటుకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఐదుసార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధకి..రాజ్యసభలో అడుగుపెడుతుండటం మాత్రం ఇదే తొలిసారి.

అలాగే నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభకు వెళ్తున్న రెండో కుటుంబ సభ్యురాలిగా కూడా సోనియా గాంధీ నిలవబోతున్నారు. 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. మరోవైపు ఇప్పటివరకూ యూపీలోని రాయ్ బరేలీ సీటు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన సోనియా ఈసారి రాజ్యసభను ఎంచుకోవడంతో ఆ స్ధానంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీనిపై త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications