తెలంగాణకే సోనియా మొగ్గు: 12పై బుజ్జగిస్తున్న కావూరి
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పది జిల్లాలతో కూడిన తెలంగాణకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణకే సోనియా ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే ఇటీవల రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కేబినెట్ కూడా దానికే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి.
అయితే సోనియా సహా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా రాయల టికి సుముఖంగా లేరని సమాచారం. పది జిల్లాల తెలంగాణ ఇస్తేనే మంచిదని వారు భావిస్తున్నారంటున్నారు. అయితే జివోఎం మాత్రం తెలంగాణ, రాయల తెలంగాణ ప్రతిపాదనలను కేబినెట్ ముందుంచనుందంటున్నారు.

జివోఎం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతుండగా, అధినేత్రి మాత్రం తెలంగాణకు సై అంటున్నారట. అయితే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం అంతిమ నిర్ణయం మాత్రం అధినేత్రిదే ఉంటుందని చెబుతున్నారు. రాయల తెలంగాణతో పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జివోఎం చెబుతున్నప్పటికీ రాయల టితో వచ్చే సమస్యలను తెలంగాణ కాంగ్రెసు నేతలతో పాటు రాయల టిని వ్యతిరేకిస్తున్న జివోఎం సభ్యులు అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్లారట. దీంతో ఈ రోజు రాత్రి కేబినెట్ దేనికి ఆమోద ముద్ర వేస్తుందనే సస్పెన్స్ నెలకొంది. అంతిమంగా అధినేత్రి పది జిల్లా తెలంగాణ వైపే మొగ్గు చూపనుందని అంటున్నారు.
ఆఖరి ప్రయత్నం
కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు నివాసంలో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కావూరి రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే అంగీకరించాలని నేతలను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజనకు కేంద్రం మొగ్గు చూపుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో రాయల టికి అంగీకరించాలని కోరుతున్నారట.
కావూరి నివాసంలో కేంద్రమంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, చిరంజీవి, పళ్లం రాజు, జెడి శీలం, ఎంపీలు అనంత వెంకట్రామి రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, ఎస్పీవై రెడ్డి తదితరులు హాజరయ్యారు. లగడపాటి రాజగోపాల్ వంటి నేతలు తాము ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని, విభజనకు అంగీకరించేది లేదని చెప్పారని తెలుస్తోంది. చిరంజీవి తదితరులు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం కోసం డిమాండ్ చేయాలని కోరారని సమాచారం.












Click it and Unblock the Notifications