Rains : ఈసారి వర్షాలే వర్షాలు-లేటుగా వచ్చినా దుమ్మురేపిన నైరుతి-25 రోజుల్లోనే రికార్డు..!
ఈ ఏడాది వర్షాల కోసం ఎదురుచూస్తున్న వారికి వాతావరణ శాఖ వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇదే క్రమంలో తాజాగా నైరుతి రుతుపవనాలకు సంబంధించి చేసిన విశ్లేషణలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తీరు ఆశాజనకంగా ఉందని ఐఎండీ చెబుతోంది. కేవలం 25 రోజుల్లోనే ఈసారి నైరుతి పవనాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించి రికార్డు సృష్టించాయి.
నైరుతి రుతుపవనాలు వాటి సాధారణ తేదీ జూలై 8 కంటే ఆరు రోజుల ముందు ఆదివారం నాడు మొత్తం దేశాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. అలాగే 38 రోజులలో అంటే జూలై 8 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయని అంచనా. కానీ ఈ ఏడాది జూన్ 8న రుతుపవనాలు ప్రారంభమైనా 25 రోజుల్లోనే దేశమంతటా విస్తరించాయి.

ఐఎండీ తాజా విశ్లేషణ ప్రకారం రుతుపవనాలు గత 25 సంవత్సరాలలో 13 సార్లు దాని సాధారణ తేదీ కంటే ముందుగా దేశం మొత్తాన్ని కవర్ చేశాయని తేలింది. అలాగే 2013లో జూన్ 16 నాటికి భారతదేశం మొత్తాన్ని కవర్ చేసినప్పుడు తొలిసారి ఇలా జరిగింది. ఆ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మేఘాల విస్ఫోటనం, ఆకస్మిక వరదల కారణంగా విపత్తులు చోటు చేసుకున్నాయి. రుతుపవనాల ముందస్తు లేదా ఆలస్యం ప్రారంభం, ముందస్తు లేదా ఆలస్యం కవరేజీకి వర్షాలకూ సంబంధం లేదు. అయితే ఇది వరి, చెరకు, ముతక తృణధాన్యాలు, పత్తి వంటి ఖరీఫ్ పంటల్ని ప్రభావితం చేస్తాయి.
ఈ ఏడాది ఆలస్యమైన రుతుపవనాలు, ఆ తర్వాత నెమ్మదిగా విస్తరించడం జూన్ మొదటి మూడు వారాల్లో నాట్లు వేసే కార్యకలాపాలను దెబ్బతీసింది. ఆ తర్వాత రుతుపవనాల వేగవంతమైన విస్తరణ, గత వారం ప్రారంభంలో దేశంలో 90% పైగా కవరేజీకి దారితీసింది, నాట్ల కార్యకలాపాలను కూడా వేగవంతం చేసింది. ఖరీఫ్ పంటల విస్తీర్ణం జూన్ 30 నాటికి 203 లక్షల హెక్టార్లకు చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications