యూపీలో అఖిలేశ్ వరాల జల్లు : ఉచిత రేషన్‌తో పాటు కిలో నెయ్యి.. 11 లక్షల ఉద్యోగాలు భర్తీ..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. ఉచిత హామీలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రాయబరేలిలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ పథకాన్ని ఎత్తేస్తుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్‌తో పాటు ప్రతినెల కిలో నెయ్యి ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
యూపీలోని యోగి ప్రభుత్వం గతంలో నవంబర్ వరకూ ఉచిత రేషన్ ఇస్తామని చెప్పదని అఖిలేశ్ పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో దానిని మార్చి వరకూ పొడిగించారని విమర్శించారు. బడ్జెట్‌కూడా ఉచిత రేషన్ పథకానికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ అధికారం ఉన్నంత కాలం ఉచిత రేషన్ ఇచ్చాం.. మళ్లీ అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రేషన్‌తో పాటు ఏడాదికి రెండు సిలెండర్లు, ప్రతినెల కిలో ఆవనూనె, నెయ్యి ఇస్తామని అఖిలేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

రాష్ట్రంలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు తిరగబడుతుండడంతో బీజేపీ నేతలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికి రావడం లేదని ఎద్దేవా చేశారు. జనం ఖాళీ సిలెండర్లు చూపిస్తూ .. కాషాయం నేతలను కడిగిపారేస్తున్నారని చురకలు అంటించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications