ఫ్లైట్‌లో అల్లాడిన ప్రయాణికులు: విమానాల మంత్రి మన రామ్మోహన్ నాయుడే
Kinjarapu Rammohan Naidu: దేశ రాజధానిలో ఉష్ణోగ్రత నిప్పులు చెరుగుతోంది. వడగాల్పులు వీస్తోన్నాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటుతోంది ప్రతి రోజూ. నైరుతి రుతుపవనాలు సకాలంలో కేరళ తీరాన్ని తాకినప్పటికీ.. అవి విస్తరించట్లేదు. ఫలితంగా ఉత్తరాదిన అటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పాటు ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య- విమానంలో ఏసీ లేకపోతే ఎలా ఉంటుంది?. దేశీయ పౌర విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు చెందిన ఓ ఫ్లైట్‌లో సరిగ్గా అలాంటి పరిస్థితే తలెత్తింది. విమానంలో ఏసీ ఆన్ చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. గంటపాటు అల్లాడిపోయారు. కొందరు వయోధిక వృద్ధులు ఎండవేడికి తట్టుకోలేక అనారోగ్యానికి సైతం గురయ్యారు.

ఢిల్లీ నుంచి దర్భంగాకు బయలుదేరాల్సిన విమానంలో ఈ ఘటన సంభవించింది. ఎస్‌జీ 486 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బిహార్‌లోని దర్భంగాకు బయలుదేరాల్సి ఉంది. టెర్నినల్‌లో నిల్చున్న ఈ ఫ్లైట్‌లో షెడ్యూల్ ప్రకారం.. ప్రయాణికులు అందరూ చెక్ ఇన్ అయ్యారు.

అయినప్పటికీ- ఫ్లైట్ సిబ్బంది ఏసీని ఆన్ చేయలేదు. దీని దెబ్బకు విమానంలో ప్రయాణికులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. చెమటతో తడిచి ముద్ద అయ్యారు. వెంటిలేషన్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. సాధారణంగా విమానాల్లో అన్నీ మూసి ఉంటాయి. బయటి నుంచి గాలి వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు.

ఏసీ ఒక్కటే వారికి ఆధారం. దాన్ని ఆన్ చేయకపోవడం వల్ల ప్రయాణికులు అల్లాడిపోయారు. చేతికి అందిన బ్రోచర్లతో విసురుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కాగా- పౌర విమానయాన శాఖ మంత్రి ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడే కావడం గమనించదగ్గ విషయం.












Click it and Unblock the Notifications