వారి పాలిట కళైంజ్ఞార్ కంటే ప్రమాదకారిని
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ వీడియో ట్వీట్ చేశారు. తమిళనాడును మోసం చేయాలనుకునేవారికి తాను ఎప్పుడూ ప్రమాదకరమేనని, ఈ విషయంలో తాను దివంగత నాయకుడు కరుణానిధి కంటే ఒక అడుగు ముందే ఉన్నానని తేల్చి చెప్పారు. అలా చెప్పుకోవడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తమిళనాడు, తమిళ ప్రజల పట్ల తనకు ఉన్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వివరించారు. తమిళనాడు ముందున్న ప్రమాదాలు, ఆందోళనల గురించి ఈ వీడియోలో పంచుకుంటున్నానని అన్నారు. తాను రాష్ట్రమంతటా ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా మనసు విప్పి చెబుతున్నానంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు స్టాలిన్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు 'స్టాలిన్, కరుణానిధి కంటే ఎక్కువ ప్రమాదకరం' అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
నిజానికి దివంగత కళైంజ్ఞార్‌తో తనను తాను ఎప్పటికీ పోల్చుకోలేనని, ఆయనను 'నాన్న' అని పిలిచిన దానికంటే 'నాయకుడు' అనే ఎక్కువగా సంబోధించానని స్టాలిన్ అన్నారు. కళైంజ్ఞర్ కంటే తాను ఒక మెట్టు పైనే ఉన్నానని ప్రజలు అంటున్నారని, అది మంచిదేనని, తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఈ ఐదేళ్ల పాలనలో ఏమి చేశానో చెప్పాలంటే, రోజుల తరబడి మాట్లాడగలనని పేర్కొన్నారు.
தமிழ்நாடு மீதும், தமிழ் மக்கள் மீதும் நான் கொண்ட பெரும் பாசத்தையும் நாம் எதிர்கொள்ளும் அபாயங்களையும் மனம்விட்டுப் பேசியுள்ளேன்.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 21, 2026
காணுங்கள்…#வெல்வோம்_ஒன்றாக ! pic.twitter.com/wu9Kek7jAD
సామాజిక న్యాయంతో కూడిన సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, గర్భస్థ శిశువుల నుంచి వృద్ధుల వరకు సమాజంలోని ప్రతి వ్యక్తి కోసం పథకాలు రూపొందించానని గుర్తు చేశారు. విద్యను ఎవరూ దొంగిలించలేరని, అది భవిష్యత్ సంపద అని స్టాలిన్ చెప్పారు. అందుకే విద్యాభివృద్ధికి 'నాన్ ముధల్వాన్' తో పాటు అనేక వినూత్న ప్రాజెక్టులను ప్రకటించానని వివరించారు. ఏ రంగాన్ని తీసుకున్నా తమిళనాడు నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆర్థికంగా కూడా రెండంకెల వృద్ధిని సాధించామని చెప్పారు. దీని సానుకూల ఫలితాలు త్వరలోనే ప్రజలకు స్పష్టంగా కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications