మరో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి: పగిలిన కోచ్ అద్దాలు
లక్నో: ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటనలు ఆగడం లేదు. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో వందేభారత్(Vande Bharat) రైలుపై దుండగులు రాళ్లు రావడంతో ఒక కోచ్ కిటికీలు పగిలిపోయాయి.
గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు ఆదివారం ఉదయం 6 గంటలకు వందే భారత్ రైలు బయల్దేరింది. బారాబంకిలో సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో కోచ్ కిటికీలు పగిలిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు.

రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) ఈ ఘటనపై కంట్రోల్ రూంకు సమాచారం అందించింది. దీంతో బారాబంకి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుుక సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైలులో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జులై 7వ తేదీన గోరఖ్‌పూర్ - లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. తొలి రైలు ఢిల్లీ - వారణాసి మార్గంలో మార్గంలో నడుస్తోంది. వందేభారత్‌కు మొత్తం 16 కోచ్ లు ఉండగా.. ఇది కేవలం 8 కోచ్‌లతో నడిచే మినీ వెర్షన్ కావడం గమనార్హం.
కాగా, గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వందేభారత్ రైళ్లపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications