విశాఖపట్నం వందే భారత్‌పై రాళ్లు
Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రాబోతోన్నారు. ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రైల్వే అధికారులు చకచకా పూర్తి చేస్తోన్నారు.

టాటా నగర్- పాట్నా, వారణాశి- దేవ్‌గఢ్, టాటానగర్- బరంపురం, రాంచీ- గొడ్డ, ఆగ్రా- వారణాశి, హౌరా- గయ, హౌరా- భాగల్‌పూర్, పుణే- నాగ్‌పూర్‌తో పాటు నాగ్‌పూర్- సికింద్రాబాద్, దుర్గ్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖపట్నం రూట్ కూడా ఇప్పటికే ఖరారయింది.
ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో లేదు. దుర్గ్- విశాఖపట్నం మధ్య దూరం 566 కిలోమీటర్లు. ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. 6 నుంచి 7 గంటల్లోగా గమ్యాస్థానాలకు చేరుకోవచ్చు.
విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతిపురం, రాయగడ, ఖండేల్ రోడ్, టిట్లాగఢ్ జంక్షన్, మహాసముంద్, రాయ్‌పూర్ జంక్షన్, భిలాయ్ మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నడుస్తోంది.
కాగా ట్రయల్ రన్ సాగిస్తోన్న దుర్గ్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై అయిదుమంది వ్యక్తులు రాళ్లు విసిరారు. మహాసముంద్ సమీపంలోని బగ్‌బహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీ-2, సీ-4, సీ-9 కోచ్ అద్దాలు పగిలిపోయాయి.
విశాఖపట్నం నుంచి దుర్గ్ వెళ్తోండగా రాత్రి 9 గంటల సమయంలో బగ్‌బహారాను సమీపించినప్పుడు దుండగులు రాళ్లు విసిరారు. రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు- శివ్‌కుమార్ బఘేల్, దేవేంద్ర చంద్రకర్, జీతూ తండీ, లఖ్‌రాజ్ సొన్వాణి, అర్జున్ యాదవ్‌గా గుర్తించారు. అరెస్ట్ చేశారు. 1989 రైల్వే యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వారిని రాయ్‌పూర్ రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications