మహారాష్ట్రలో బీజేపీ పట్టు నిలుపుకునేనా..?
మహారాష్ట్ర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ , నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్నాయి. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 145 సీట్లు మెజార్టీ రావాల్సి ఉంది. ఒక్కసారి మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే..
2019లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి అండగా నిలవలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ 105 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించగా, శివసేన పార్టీ -56 , ఎన్సీపీ - 54, కాంగ్రెస్ పార్టీ - 44 సీట్లు సాధించాయి. అధికారం కోసం శివసేన ,ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ థాకరేను ఉమ్మడి సీఎంగా ఎంపిక చేశారు.

అయితే కొద్ది కాలానికే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శివసేన మరియు ఎన్సీపీ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే ,ఎన్‌సీపీ అజిత్ పవార్.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. అయితే శివసేన పార్టీ, గుర్తు తమదే అని ఏక్‌నాథ్ షిండే కోర్టుకు వెళ్లడం, ఆయనకు మద్దతుగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది.
గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు సాధించి అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈసారి ఏక్‌నాథ్ షిండే,అజిత్ పవార్‌లతో కలిసి బీజేపీ పోటీ చేస్తుంది. అయితే గతంలో సాధించిన సీట్లను బీజేపీ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే సీఎం పదవి రాజీనామాతో పాటు, పార్టీ గుర్తు కూడా లాగేసుకోవడంతో ఉద్ధవ్ థాకరేపై మహారాష్ట్ర ఓటర్లలో కొంత సానుభూతి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ ఉద్ధవ్ థాకరే యొక్క సేన (UBT) ముంబైలో గణనీయమైన విజయాన్ని సాధించింది.
పార్టీ పేరు, గుర్తును కోల్పోయినప్పటికీ, బాల్ థాకరే వారసత్వానికి అతని వాదనను బలపరిచి, నాలుగు స్థానాలకు మూడు స్థానాలను గెలుచుకుంది. దీంతో మహారాష్ట్రలో బీజేపీ కూటమికి కొంత వ్యతిరేక గాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీతో పాటు శరద్ పవార్ పార్టీ కూడా కలిసి పోటీ చేయడం ఉద్ధవ్ థాకరేకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications