CAA: ‘రాజకీయ పార్టీల కుట్రలో భాగం కావొద్దు.. విద్యార్థులూ ముందు చట్టాన్ని చదవండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 2019కు ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఆ బిల్లు చట్టంగా మారింది.
ఈ నేపథ్యంలో పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలతోపాటు పలు విద్యార్థి సంఘాలు కూడా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే భారతీయులెవరూ కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ చట్టం కారణంగా ఏ మతానికి చెందిన భారతీయుడికి కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. కొందరు స్వార్థపూరిత దుష్టశక్తులు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

కాగా, హోంమంత్రి అమిత్ షా కూడా తాజాగా ఆందోళనలపై స్పందించారు. జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడేందుకు స్వార్థ రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం అనేది మనదేశానికి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియేనని.. భారతీయ పౌరులను ఎవరినీ కూడా ఈ చట్టం ద్వారా బయటికి పంపడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు స్వార్థపూరిత రాజకీయ పార్టీల మాయలో పడకుండా పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా చదవాలని కీలక సూచన చేశారు. అప్పుడే చట్టం గురించి పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మన దేశానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, తదితర వర్గాల శరణార్థులకు మనదేశ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. 2014కు ముందు వచ్చిన ఈ మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించబడుతుంది. ముస్లిం దేశాలైన ఆ మూడు దేశాల్లో వివక్ష ఎదుర్కొని, బతలేని పరిస్థితిలో మనదేశానికి వచ్చిన వారికి ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications