రాజకీయాల్లోకి హీరోలేనా? మేం రాకూడదా?: సుహాసిని సంచలనం
Recommended Video

చెన్నై: తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగప్రవేశానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కమలహాసన్ కూడా తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు.

హీరోలే రాజకీయాల్లోకి వస్తారా?
ఈ నేపథ్యంలో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ.. ‘హీరోలే రాజకీయాల్లోకి రావాలా? మేము రాజకీయాల్లోకి రాకూడదా?' అంటూ ప్రశ్నించారు.

మేమూ సిద్ధమే..
‘తమిళ ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం' అని సుహాసిని అన్నారు.

ఇప్పటికే ఖుష్బూ
మరోవైపు ఆమె సమకాలీనులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారని కోలీవుడ్ సమాచారం. ఇప్పటికే నటి ఖుష్పూ రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రజినీ సస్పెన్స్
రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ తన రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అభిమానులతో సమావేశాలు నిర్వహించి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తారా? లేక సొంత పార్టీ పెడతారా? అనేది తేలాల్సి ఉంది.

తేల్చేసిన కమల్
ఇక కమలహాసన్ రాజకీయాలపై గత కొంత కాలంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇటీవలే రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీతో వస్తున్నట్లు తెలిపారు. ఈ నవంబర్ నెలలోనే కమల్ తన పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications