Patanjali: బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు-క్షమాపణలూ తిరస్కరణ..!
సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇచ్చిన వ్యవహారంలో పతంజలి సంస్ధ అధినేతలు రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము ఈ వ్యవహారంలో గుడ్డిగా ఉండబోమని, ఉదారంగా వ్యవహరించలేమని వీరిద్దరికీ తేల్చిచెప్పేసింది. ఈ మేరకు వారిద్దరూ కోర్టుకు బేషరతుగా చెప్పిన క్షమాపణల్నీ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ధిక్కారం కేసులో వీరిద్దరిపై చర్యల్ని ఏప్రిల్ 16న ఖరారు చేస్తామని ప్రకటించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని ఇవ్వొద్దంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి వాటిని కొనసాగించిన వ్యవహారంలో ఇవాళ కోర్టుకు హాజరైన పతంజలి అధినేతలపై ఇవాళ జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో క్షమాపణలు చెప్తూ కోర్టుకు అఫిడవిట్ లు సమర్పించాల్సి ఉండగా.. అంతకంటే ముందు మీడియాకు పంపడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు వీరిద్దరూ చెప్పే క్షమాపణ హృదయపూర్వకంగా ఉందా అని జస్టిస్ అమానుల్లా ప్రశ్నించారు. తమ క్లయింట్లు సాధారణ పౌరుల్లాగే తప్పులు చేశారన్న వారి లాయర్ ముకుల్ రోహత్గీ వాదనపై బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మా ఆదేశాల తర్వాత కూడానా అని ప్రశ్నించింది. క్షమాపణలు చెప్పడం సరిపోదని,కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు దాని పర్యవసానాలను అనుభవించాలని తెలిపింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండకూడదనుకుంటున్నామని తేల్చిచెప్పేసింది.
సమాజానికి ఒక సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ప్రభుత్వం మిమ్మల్ని ఈ ప్రకటనలు ఉపసంహరించుకోమని అడిగితే హైకోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదని చెప్పిన విషయాన్ని గుర్తించింది. ఇది మీ ప్రవర్తనకు అద్దం పడుతోందని ఆక్షేపించింది. అలాగే ఇంత జరుగుతున్నా పతంజలి స్వస్ధలమైన ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. మిమ్మల్నీ చీల్చి చెండాడతామని హెచ్చరించింది. ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారం కింద రాందేవ్, బాలకృష్ణపై చర్యల్ని ఏప్రిల్ 16న ప్రకటిస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications