మీరు జైల్లో ఉండటమే బెటర్..
ఆమ్రపాలి గ్రూప్ నిధుల అవకతవకల కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ అనిల్ కుమార్ శర్మ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఇళ్ల కొనుగోలుదారులను ఆయన మోసగించారని, తాము సానుభూతి చూపించలేమని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అనిల్ శర్మ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వేలమందిని మోసగించారని, ఇది సాదాసీదా మోసం కాదని, మీరేం చేశారో ఈ కోర్టుకు బాగా తెలుసన్నారు. మీ నేరం చాలా తీవ్రమైందని, ఇళ్ల కొనుగోలుదారులు వారి జీవితకాలంలో కష్టపడి సంపాదించుకున్న డబ్బును దోచుకున్నారని, దీనివల్ల వేలమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి భవిష్యత్తును గందరగోళంలో పడేశారని, వారి సమస్యకు తాము పరిష్కారాన్ని కూడా కనుగొనలేకపోతున్నామని, సానుభూతి చూపించేందుకు కూడా అనిల్ కుమార్ శర్మ అర్హులు కారని, మీరు జైల్లో ఉండటమే ఉత్తమమని వ్యాఖ్యానించింది. బెయిల్ అభ్యర్థనపై దర్యాప్తు సంస్థలకు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన కోర్టు అతడి పిటిషన్ ను కొట్టేసింది.

ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామంటూ ఆమ్రపాలి గ్రూప్ దాదాపు 42వేల మంది నుంచి డబ్బులు తీసుకుంది. ఇళ్లు కట్టించకపోవడంతో మోసపోయామని గ్రహించిన పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కంపెనీ విషయంలో విచారణ జరిగినప్పుడే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఫొరెన్సిక్ తనిఖీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూ.5,619 కోట్ల నిధులను కంపెనీకి చెందిన అనుబంధ సంస్థల్లోకి దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీని ఆధారంగా అనిల్ శర్మతో పాటు కంపెనీకి చెందిన పలువురు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసి మోసంతోపాటు, ఇతర కేసులను నమోదు చేశారు. 2018 నుంచి వారంతా జైల్లోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications