ఆ రైతుల్ని జైల్లో పెట్టండి.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇటీవల దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఓ వైపు వాహనాలు, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే పొగ, దుమ్ముధూళితోపాటు పంట వ్యర్థాల దహనం కూడా అధికం అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్రతరం అవుతోంది. భారత్ లో వెల్లడవుతున్న వాయు కాలుష్యంలో 51 శాతం పారిశ్రామిక కాలుష్యం, 27 శాతం వాహనాలు, 17 శాతం పంటలను కాల్చడం అలాగే 5 శాతం ఇతర వనరుల వల్ల సంభవిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాక వాయు కాలుష్యం ప్రతి సంవత్సరం 2 మిలియన్ల భారతీయుల అకాల మరణాలకు దోహదం చేస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఇక దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోనే అత్యంత విషపూరితమైన గాలి ఉన్న ప్రాంతాల్లో దిల్లీ.. దాని చుట్టు పక్కన ప్రాంతాలే టాప్ లో ఉన్నాయి. ఇక శీతాకాలంలో అయితే ఈ కాలుష్యం సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం పంట వ్యర్థాలను అక్కడి రైతులు కాల్చేస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా రైతులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు, కోర్టులు అనేకసార్లు వారించినా కొందరు రైతులు మాత్రం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు ప్రధానంగా పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తరువాత వేసే పంటలకు ఈ బూడిద ఎరువుగా ఉంటుందని పంట దిగుబడి భారీగా పెరుగుతుందని వారి విశ్వాసం. కానీ పంట వ్యర్థాల దహనం కారణంగా వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని కోర్టులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాలను దహనం చేస్తున్న రైతులను జైల్లో పెట్టాలని.. అలా చేస్తేనే మిగతా వారికి అర్థమవుతుందని తెలిపింది.
పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రైతులకు శిక్ష, జరిమానా ఎందుకు విధించకూడదని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులైనా.. పర్యావరణానికి హాని కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ప్రశ్నించింది. కొందరిని జైలుకు పంపితేనే మిగతా వాళ్లకి గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications