పాకిస్తానీయుడికి భారత పాస్‌పోర్ట్- సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
పహల్గామ్‌లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో ప్రధానమైనవి- దేశంలో నివసించే పాకిస్తానీయులను బహిష్కరించడం. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయడం.

అధికారిక ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పంజాబ్ అమృత్‌సర్ సమీపంలో ఉన్న ఈ బోర్డర్‌ను బీఎస్ఎఫ్ అధికారులు మూసివేశారు. పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిన్నటి వరకూ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ సరిహద్దు చెక్‌పోస్ట్ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే.
చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది.
అత్యవసర వైద్య చికిత్స, వ్యాపార కార్యకలాపాలు, ఇక్కడ నివసిస్తోన్న తమ బంధువులను కలుసుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కారణాలతో తరచూ పలువురు పాకిస్తానీయులు విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు జారీ చేసే అధికారిక డాక్యుమెంట్లతో భారత్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్.
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వాళ్లంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మే 1 తేదీ లోపలే భారత్‌ను వదిలి తమ దేశానికి వెళ్లి పోవాల్సి ఉంటుంది. అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్ ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు ముగిసిన నేపథ్యంలో పలువురు పాకిస్తానీయులు అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
కాగా- ఈ పరిణామాల మధ్య భారత పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు కలిగి ఉండీ, భారతీయ పౌరులమని చెప్పుకొంటోన్న బెంగళూరుకు చెందిన ఓ పాకిస్తానీయుడు.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. అతని కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన దేశ బహిష్కరణను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తనను, తన కుటుంబాన్ని భారత పౌరులుగా గుర్తించడం వల్లే విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్ పోర్ట్ సైతం మంజూరు చేసిందని అతను సుప్రీంకోర్టులో వాదించాడు. ఆధార్ కార్డు సైతం ఇచ్చిందని పేర్కొన్నాడు.

ఆ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సంచలన ఆదేశాలను జారీ చేసింది. అతని దేశ బహిష్కరణపై తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
వారి భారతీయ పౌరసత్వం చెల్లుబాటుకు సంబంధించి కుటుంబ సభ్యుల పత్రాలను ధృవీకరించాలని అధికారులను ఆదేశించింది జస్టిస్ సూర్యకాంత్ బెంచ్. ప్రభుత్వ అధికారులు తగిన నిర్ణయం తీసుకునే వరకు అతను, అతని కుటుంబంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సూచించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పిటీషనర్ అసంతృప్తి చెందితే జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టును సైతం ఆశ్రయించే స్వేచ్ఛను కూడా ఈ ధర్మాసనం మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications