
పెగాసస్ నివేదిక మరింత ఆలస్యం-దర్యాప్తు కమిటీకి జూన్ 28వరకూ గడువిచ్చిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లతో పాటు వేలాది మందిని కుదిపేసిన పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తమ నివేదిక అందజేసేందుకు మరింత గడువు కోరింది. దీనికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. దీంతో జూన్ 28 లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
పెగాసస్ వివాదంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రవీంద్రన్ కమిటీకి సుప్రీంకోర్టు ఇవాళ మరింత సమయం ఇచ్చింది. నివేదిక దాఖలు చేసేందుకు మరోమారు గడువు పొడిగించాలని కమిటీ కోరింది. దీంతో సుప్రీంకోర్టు ఈ పొడిగింపును అనుమతించింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికను జూన్ 28 లోపు సమర్పించాల్సి ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ మాట్లాడుతూ, పరికరాలను పరిశీలించడానికి కమిటీ తన స్వంత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిందని , ప్రభుత్వ సంస్థల నుండి ఈ మేరకు సమాచారం అందిందని తెలిపారు.

పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడాన్ని పరిశీలించడానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ అంశాలు ఓ పద్ధతి కాగా.. . రెండవది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సిఫార్సులు. మొదటి భాగం సాంకేతిక కమిటీ కింద, రెండవది న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
పెగాసస్ కేసులో సాంకేతిక కమిటీ పెగాసస్ కోసం పరికరాలను పరీక్షించడానికి SOPని ఖరారు చేసే ప్రక్రియలో ఇంకా ఉందని చెప్పారు. మే నెలాఖరులోగా ఇది ఖరారు కానుంది.సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ రవీంద్రన్‌కు నివేదిక ఇచ్చేందుకు సాంకేతిక కమిటీకి సమయం ఇచ్చింది.