తొలి మహిళా సిబిఐ అధికారికి సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: సిబిఐ అడిషనల్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్న అర్చనా రామసుందరం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అర్చనా రామసుందరం ఆ పదవీ బాధ్యతలు స్వీకరించిన తదుపరి రోజే విధులు నిర్వర్తించకుండా ఆమెను నిలువరిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె నియామకం ప్రాథమికంగా నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోథా సారథ్యంలోని జస్టిస్ ఏకె పట్నాయక్, జస్టిస్ కెఎస్ రాధకృష్ణ, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది.
సంబందిత ఎంపిక కమిటీ సిఫారసు చేయకుండానే ఆమెను సిబిఐ అడిషన్ డైరెక్టర్‌గా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బెంచ్ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం... ఎప్పుడైనా సరే సంబంధిత ఎంపిక సంఘం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడమనేదీ రివాజు అని కోర్టు తెలిపింది.

అందుకు తలొగ్గి దానినే పాటించాలి కూడా అని పేర్కొంది. అయితే అర్చనా రామసుందరం విషయం ఆ విధంగా జరగలేదని కోర్టు తెలిపింది. అందుకే ఆమెను విధుల్లో కొనసాగడానికి అనుమతించరాదు అని సుప్రీం కోర్టు పేర్కొంది. మే 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్చనా రామసుందరం.. సిబిఐలో ఇప్పటికే అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారంటూ ఆమె తరపు న్యాయవాది అశోక్ కుమార్ గంగూలీ కోర్టు తెలిపారు.
ప్రాథమికంగా అర్చనా రామసుందరం నియామకమే చట్టవిరుద్ధంగా ఉంటే.. ఆమెను ఆ పదవిలో కొనసాగనీయడం సమర్థనీయం కాదని తాము భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆమె విధులు నిర్వర్తించడానికి వీలులేదని పేర్కొంది. సిబిఐలో మొదటి మహిళా అదనపు డైరెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే అర్చనా రామసుందరంను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications