కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తెలు.. సుప్రీం చారిత్రాత్మక తీర్పు

"పెళ్లయినంత మాత్రాన కూతురు పరాయిది అయిపోదు.. కొడుకులకు వర్తించే హక్కులు కుమార్తెలకూ సమానంగా వర్తిస్తాయి!" అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కారుణ్య నియామకాలు, ప్రభుత్వ లైసెన్సుల బదిలీల విషయంలో 'కుటుంబం' నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెలను (పెళ్లయిన కూతుళ్లను) మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పులను సుప్రీంకోర్టు పూర్తిగా పక్కనపెట్టింది.

ఈ సంచలన తీర్పు వెనుక ఓ కన్నకూతురి కన్నీటి పోరాటం, బాధ్యతగల సోదరి ఆవేదన దాగున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్సుమ్ నిషా అనే మహిళ, తన వివాహం జరిగిన తర్వాత కూడా అదే గ్రామంలో ఉంటూ తన తల్లికి అండగా నిలిచింది. తల్లి నడుపుతున్న రేషన్ (చౌక ధరల) దుకాణం నిర్వహణలో చురుగ్గా పాలుపంచుకుంది. అయితే, తల్లి హఠాన్మరణం చెందడంతో, ఆ కుటుంబం రోడ్డున పడింది. దివ్యాంగురాలైన ఒక సోదరితో సహా, తన చెల్లెళ్ల బాధ్యత అంతా కుల్సుమ్ నిషా భుజాన పడింది.

Supreme Court Landmark Verdict Married Daughters Eligible For Compassionate Appointments Quashing HC Orders

ఆ కుటుంబానికి జీవనాధారమైన చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను కారుణ్య ప్రాతిపదికన తన పేరు మీద బదిలీ చేయాలని ఆమె అధికారులకు దరఖాస్తు చేసుకుంది. కానీ, యంత్రాంగం ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. యూపీ ప్రభుత్వం 2019లో తెచ్చిన జీవో ప్రకారం 'కుటుంబం' నిర్వచనంలో పెళ్లయిన ఆడపిల్లలకు చోటు లేదని, అందువల్ల లైసెన్స్ ఇవ్వడం కుదరదని దరఖాస్తును తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా చుక్కెదురు కావడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టుల మధ్య భిన్న తీర్పులు.. తెరదించిన సుప్రీంకోర్టు!

ఈ వ్యవహారంలో గతంలో దేశంలోని వివిధ హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయి. 2015లో విమల్ శ్రీవాస్తవ కేసులో అలహాబాద్ హైకోర్టు వివాహిత కుమార్తెలను మినహాయించడం తప్పు అని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత 2021 (కుసుమలత), 2023 (సైదా బేగం) కేసుల్లో అదే హైకోర్టు డివిజన్ బెంచ్ భిన్నంగా తీర్పునిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బొంబాయి హైకోర్టు (2014 రంజనా మురళీధర్ కేసు), గుజరాత్ హైకోర్టులు మాత్రం వివాహిత కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 19(1)(g) ల ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేశాయి.

POCSO అస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! భార్యలకు వార్నింగ్
POCSO అస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! భార్యలకు వార్నింగ్

ఈ భిన్నమైన వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన విరుద్ధ తీర్పులను రద్దు చేసింది. బొంబాయి హైకోర్టు అభిప్రాయంతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించింది. "సైదా బేగం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైన చట్టాన్ని నిర్దేశించలేదు" అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

పెళ్లనే నెపంతో హక్కులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం!

"ఈ కేసులోని ఆధారాలను బట్టి కుల్సుమ్ నిషా వివాహం తర్వాత కూడా తల్లికి సాయంగా ఉంటూ, ఆమె మరణానంతరం దివ్యాంగురాలైన సోదరి బాధ్యతలు స్వీకరించిందని స్పష్టమవుతోంది. కేవలం ఆమె 'వివాహిత కుమార్తె' అనే ఒకే ఒక్క కారణంతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగబద్ధంగా చెల్లని కారణం. వివాహిత కుమారులు కారుణ్య నియామకాలకు అర్హులైనప్పుడు, కుమార్తెలను ఏ ప్రాతిపదికన నిరాకరిస్తారు?" అని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది.

సె*క్స్ వర్కర్ల జీవితాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!
సె*క్స్ వర్కర్ల జీవితాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

వివాహ స్థితిని బట్టి అర్హులైన కుమార్తెలకు సంక్షేమ ప్రయోజనాలు నిరాకరించడం ఎంతమాత్రం సరికాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కుల్సుమ్ నిషాకు లైసెన్స్ నిరాకరిస్తూ గతంలో అధికారులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన ధర్మాసనం.. రాబోయే నాలుగు వారాల్లోగా (నెల రోజుల్లో) ఆమెకు చెల్లుబాటు అయ్యే రేషన్ దుకాణ లైసెన్స్ ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాలు, ప్రభుత్వ ప్రయోజనాల కోసం పోరాడుతున్న లక్షలాది మంది కుమార్తెల హక్కులకు ఈ తీర్పు ఒక రక్షణ కవచంలా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+