Supreme Court: అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దు.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
Supreme Court: అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించారు. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం అటవీ (సంరక్షణ) చట్టంలో చేసిన సవరణల కారణంగా 1.97 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి అటవీ ప్రాంతం నుండి మినహాయించబడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఏదైనా ముఖ్యమైన పనికి అటవీ భూమిని ఉపయోగించాల్సి వస్తే, చెట్లను నాటడానికి ఇతర భూమిని అందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏదీ అనుమతించబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 'తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, అటవీ భూమి తగ్గింపుకు దారితీసే ఎటువంటి చర్యను భారత ప్రభుత్వం లేదా ఏ రాష్ట్రం తీసుకోకూడదని ఆదేశిస్తున్నాము' అని ధర్మాసనం పేర్కొంది.

కొన్ని పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రాగా.. వాటిలో ఒకటి రిటైర్డ్ భారత అటవీ అధికారుల బృందం దాఖలు చేసింది. ఈ పిటిషన్లు ఈ సవరణను సవాలు చేస్తూ, ఇది పెద్ద అడవుల నుండి చట్టపరమైన రక్షణను తొలగిస్తుందని, అటవీయేతర ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నాయి. చట్టంలో మార్పు భారత దశాబ్దాల నాటి అటవీ పాలన వ్యవస్థను దెబ్బతీస్తుందని పిటిషనర్లు తెలిపారు.
సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్, న్యాయవాది కౌశిక్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెట్ల సంఖ్యను పెంచడానికి ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించిందని, అయితే అది భారతదేశ అటవీ విస్తీర్ణానికి చాలా హానికరం అని అన్నారు. మంత్రిత్వ శాఖ ఆమోదించిన యంత్రాంగం ప్రధానంగా అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం సులభంగా మళ్లించడానికి ఉద్దేశించిబడిందని వారు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందని, దీనికి మూడు వారాల సమయం కావాలని కోరారు. తదుపరి విచారణ తేదీన దేశంలో ప్రకటించిన అటవీ ప్రాంతంపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
అడవుల సంరక్షణకు కీలక నిర్ణయం
భారతదేశ అడవుల సంరక్షణకు ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది. దీనివల్ల అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించకుండా, దేశంలోని అటవీ విస్తీర్ణం తగ్గకుండా చూసుకోవచ్చు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో అడవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ నిర్ణయం ముఖ్యమైనది. ఈ నిర్ణయం అడవులపై ఆధారపడిన వారికి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం అడవులను సంరక్షించి, భవిష్యత్ తరాలకు వాటిని సంరక్షించేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications