సీఈసీతో పాటు కమిషనర్లకూ షాక్..! నియామకాలపై సుప్రీంలో కో వారెంటో పిటిషన్..!
కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీతో పాటు కమిషనర్ల నియామకాల కోసం గతంలో ఉన్న కమిటీలో మార్పులు చేస్తూ కేంద్రం పార్లమెంట్ లో 2023లో ఓ చట్టం చేసింది. దీని ప్రకారం అప్పటివరకూ ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటు ఉన్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ను కాదని, ఆ స్ధానంలో ప్రధాని సిఫార్సు చేసే కేంద్రమంత్రిని చేర్చేలా ఈ చట్టంలో మార్పు చేశారు. దీని ఆధారంగా జరిగిన సీఈసీ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల నియామకాలు రద్దుచేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది.
ఓవైపు ఎస్ఐఆర్ పై ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాల ఆరోపణలు, మరోవైపు 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో మార్పుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల నియామకాలన్నింటినీ సవాలు చేస్తూ, వారికి వ్యతిరేకంగా కో వారంటో రిట్ జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి నియామకాలు 2023 సీఈసీ, ఈసీల చట్టం కింద నిర్దేశించిన విధానాన్ని ఉల్లంఘించాయని పిటిషనర్ వాదిస్తున్నారు.

హడావిడిగా చేసిన ఈ నియామకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎంపిక కమిటీ సభ్యులకు పూర్తి వివరాలను పంపిణీ చేసిన తర్వాత మాత్రమే నియామకాలు జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు మార్చి 2024 ఉత్తర్వును పిటిషనర్ ప్రస్తావించారు. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, ప్రతి ఖాళీకి 5 పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా, అలా చేయలేదని పిటిషనర్ వాదిస్తున్నారు. ఈ అధికారులలో ఎవరూ గతంలో ఎన్నికలకు సంబంధించిన పనులను నిర్వహించలేదని, అలాగే వారు సెక్షన్ 5 కింద అర్హతా ప్రమాణాలను అందుకోలేదని కూడా పిటిషనర్ వాదిస్తున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టం రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై విచారణ, తుది తీర్పును ఆలస్యం చేస్తున్న సుప్రీంకోర్టుకు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురు కాబోతోంది.














Click it and Unblock the Notifications
