గృహిణులు కాదు జాతి నిర్మాతలు: నెలకు రూ.30,000 చెల్లించాలి: సుప్రీం సంచలన ఉత్తర్వులు
కోట్లాదిమంది గృహిణుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. దానికి తగ్గట్టుగా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ దిశగా ఉత్తర్వులు సైతం జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంట్లో వారు అందించే సేవలను ప్రత్యేకమైన నష్టపరిహార ప్రాతిపదికగా పరిగణించాలని స్పష్టం చేసింది.
మోటారు వాహనాల చట్టం (MV Act) పరిధిలో దాఖలయ్యే ప్రమాద పరిహార కేసుల్లో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పును వెలువరించింది. ఏదైనా ప్రమాదంలో గృహిణి మరణించినా లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఆమె అందించే డొమెస్టిక్ కేర్ కు సంబంధించిన పరిహారం మొత్తాన్ని లెక్కించేటప్పుడు ఒక ప్రత్యేక అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

గృహిణులు అందించే డొమెస్టిక్ కేర్ ను వెలకట్టలేమని, వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. గృహిణులు చేసే సేవలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే ఇకపై 'హోమ్ మేకర్' అనే పదానికి బదులుగా వారిని 'నేషన్ బిల్డర్' అనే గుర్తింపు లభించాలని కోర్టు ఆకాంక్షించింది. గృహిణులు, వారు అందించే సేవలన్నీ కూడా ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాదని బెంచ్ తేల్చి చెప్పింది.
కుటుంబ సభ్యులు/వ్యక్తుల ఎదుగుదల, దేశ ప్రగతికి గృహిణులు ఎంతగానో దోహదపడతారని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. "గృహిణిని ఇకపై దేశ నిర్మాతగా (Nation builder) గుర్తించాలి. గతంలో వెలువడిన 'ప్రణయ్ సేథి' తీర్పులోని మార్గదర్శకాలకు అదనంగా, ఇప్పుడు ఈ గృహ నిర్వహణ సేవల (Domestic Care) నష్టాన్ని కూడా పరిహారంలో చేర్చాలి.." అని తb తీర్పులో పేర్కొన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు గృహిణులు అందించే ఈ సేవలకు ఆర్థిక విలువ కట్టే విషయమై కోర్టు స్పష్టత ఇచ్చింది. గృహ నిర్వహణ సేవలకు కోల్పోయిన నష్టాన్ని నెలవారీ ఆదాయంగా పరిగణించాని సూచించింది. ప్రతి నెలా 30,000 రూపాయల మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇది ఒక నూతన ప్రాథమిక సూత్రంగా అమలులోకి వస్తుందని, ఇప్పటికే ఉన్న పరిహార నిబంధనలకు ఇది అదనపు అంశమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తాజా తీర్పు.. 2024లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై దాఖలైన అప్పీల్ పిటిషన్ విచారణ సందర్భంగా వెలువడింది. 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, అప్పట్లో ఆమె కుటుంబానికి హైకోర్టు సుమారు ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ కేసులో న్యాయపరమైన సవరణలు చేస్తూ, బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications