నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా ? ఇక హైకోర్టులెందుకు ?
ఈ మధ్య చాలా కేసుల్లో పిటిషనర్లు రాష్ట్రాల హైకోర్టుల్ని ఆశ్రయించకుండా సుప్రీంకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేస్తుండటంపై అత్యున్నత న్యాయస్దానం (Supreme court) అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను మియాలుగా పేర్కొంటూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలంటూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
అస్సాంలో ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర శాఖ తాజాగా ఓ వీడియో విడుదల చేసింద. ఇందులో సీఎం హిమంత బిశ్వ శర్మ.. ముస్లింల ఫోటోపై కాల్పులు జరిపినట్లు చూపించారు. అలాగే బెంగాలీ మాట్లాడే ముస్లింలను మియాలు అంటూ చేసిన చౌకబాబు వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ వారిని అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంది. దీంతో సీఎం చేసిన ద్వేషపూరిత ప్రసంగాలపై పోలీసు కేసు నమోదు చేసి, సిట్ తో దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వాటిని తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. పిటిషనర్లను మొదట గౌహతి హైకోర్టును సంప్రదించాలని ఆదేశించింది. ఎన్నికల ముందు తలెత్తిన వివాదాలను సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకుని తేల్చుకునే ప్రమాదకర ధోరణి వ్యాపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు తమను తాము నిగ్రహించుకోవాలని , రాజ్యాంగ నైతికత సరిహద్దుల్లో వ్యవహరించాలని కోరింది. మరో రెండు, మూడు నెలల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.












Click it and Unblock the Notifications