ఎలక్ట్రోరల్ బాండ్ల పథకంపై సుప్రీం కీలక నిర్ణయం-బతికిపోయిన రాజకీయ పార్టీలు..!
ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలక్ట్రోరల్ బాండ్లపై పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని దుర్వినియోగం చేసుకున్నాయని, దీన్ని వాడుకుని భారీ ఎత్తున కార్పోరేట్ల నుంచి అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. అంతే కాదు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా గత ఏడాదిలో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సైతం స్టేట్ బ్యాంక్ తో బయటపెట్టించింది. ఇంతటితో ఈ కథ ముగిసిందని అంతా భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం రద్దయినా అప్పట్లో దీన్ని వాడుకుని రాజకీయ పార్టీలు పాల్పడిన అక్రమాలపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ సిట్ దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రోరల్ బాండ్లను ఇప్పటికే రద్దు చేసినందున ఇక దీనిపై సిట్ దర్యాప్తు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చిచెప్పేసింది. దీంతో సిట్ దర్యాప్తు కోసం దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎలక్ట్రోర్ బాండ్లపై రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశించడం అనుచితం, సందర్భ రహితంగా పేర్కొంది. సాధారణ చట్టాల ప్రకారం ఇతర పరిష్కారాలు క్రిమినల్ లా ప్రక్రియను నియంత్రించగలవని పేర్కొంది. ఐటీ రిటర్నులను తవ్వితీసి విచారణకు ఆదేశించడం లాంటిదే సిట్ దర్యాప్తు కూడా అని అభిప్రాయపడింది. కాబట్టి సిట్ దర్యాప్తుకు ఆదేశించలేమని తెలిపింది. సుప్రీం నిర్ణయంతో అప్పట్లో అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications