ఈడీ చీఫ్‌పై సుప్రీం నజర్: మోడీ ప్రభుత్వానికి సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ నోటీసులు..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు రోజురోజుకూ తీవ్రతరం అవుతోన్నాయి. ఇదివరకు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని కిందటి నెలలో ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. అంతకుముందు ఇదే కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని అయిదు రోజుల పాటు ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో నిరవధికంగా సోదాలు, దాడులు సాగుతున్నాయి.

విస్తృత దాడుల వేళ..
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యారు. వారంతా విచారణను ఎదుర్కొంటోన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులోనే ఇవ్వాళ కూడా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు సాగిస్తోన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా..
ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు వ్యవహారం తాజాగా తెర మీదికి వచ్చింది. ఆయన పదవీ కాలం ఇదివరకే ముగిసిప్పటికీ.. మరో ఏడాది పాటు పొడిగించింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించింది.

పదవీ కాలం ముగిసినా..
సంజయ్ కుమార్ మిశ్రా.. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2018 నవంబర్ 19వ తేదీన ఆయన తొలిసారిగా ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన అదే హోదాలో కొనసాగుతారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి అనుగుణంగా గత ఏడాది నవంబర్ 18వ తేదీన ఆయన పదవీ కాలం ముగిసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. అంటే- ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు ఈడీ డైరెక్టర్‌గా కొనసాగుతారు.

పిటీషన్ వేసింది వీరే..
ఆయన సర్వీసు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జయ ఠాకూర్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సాకేత్ గోఖలే, మహువా మొయిత్రా ఈ పిటీషన్ వేశారు. కృష్ణ చందర్ సింగ్, వినీత్ నారాయణ్, మనోహర్ లాల్ శర్మ వేరుగా పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

10 రోజుల్లోగా..
దేశవ్యాప్తంగా ఈడీ అధికారుల దాడులు విస్తృతంగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇవ్వాళ.. మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటీషన్‌పై విచారణను 10 రోజుల తరువాత లిస్టింగ్ చేస్తామని ధర్మాసనం తెలిపింది.












Click it and Unblock the Notifications