రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్..! ఢిల్లీ నిరసనల వేళ మోడీ కేసులో..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో ఇండియా కూటమితో కలిసి నిరసనలకు దిగుతున్న విపక్ష నేత రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ లో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసి తిరిగి దాఖలు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. అదే సమయంలో మరో కేసులో రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఇవాళ భారీ ఊరట లభించింది.
2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహారాష్ట్రలోని స్ధానిక కోర్టులో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది. దీనిపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. దీంతో ఈ విచారణను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఫిర్యాదుదారు ఎం.హెచ్.శ్రీశ్రీమాల్‌కు నాలుగు వారాల్లోగా స్పందనలు తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. అలాగే స్థానిక కోర్టులో తదుపరి విచారణ నిలిపేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబర్ 8న ఈ పరువు నష్టం కేసులో 2019లో రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లను రద్దు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. ఫిర్యాదుదారు శ్రీశ్రీమల్ ఫిర్యాదుపై తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2019 ఆగస్టు 28న గిర్గావ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే రాహుల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా, ఆ ఫిర్యాదుపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ 2021లో ఇచ్చిన తన ఉత్తర్వును హైకోర్టు కొనసాగించింది. ఇప్పుడు ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విచారణపై స్టే ఇవ్వడంతో కీలక సమయంలో రాహుల్ గాంధీకి ఊరట దక్కినట్లయింది. ఢిల్లీ ఆందోళనల సమయంలో కేంద్రంపై పైచేయి సాధించేందుకు రాహుల్ కు ఇది మరో అవకాశం కల్పించింది.














Click it and Unblock the Notifications
