మాజీ సీజేఐ ఎన్వీ రమణ హయాం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటిని విచారించడానికి ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు- గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం జైలు నుంచి విముక్తి కల్పించడాన్ని నిరసిస్తూ ఉద్యమిస్తోన్న వారికి ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇదివరకే గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేయగా.. ఇప్పుడు దీన్ని విచారించడానికి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.

గుజరాత్ అల్లర్లలో
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు దారుణంగా హతమార్చాయి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టింది. వారికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది.

దోషులు వీరే..
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులైన 11 మంది- రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బోంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.

సుప్రీంకోర్టులో..
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదరైంది. అత్యంత దారుణకాండకు పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడాన్ని స్వాగతించట్లేదంటూ పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. వేలాదిమంది రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వేర్వేరు శాఖల్లో పని చేస్తోన్న ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, చరిత్రకారులు, ఫిల్మ్‌మేకర్స్, జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మానవ హక్కుల ఉల్లంఘన..
రేపిస్టుల విడుదలపై సీనియర్ అడ్వొకేట్ అపర్ణ భట్ అప్పట్లో పిటీషన్ దాఖలు చేశారు. మానవ హక్కులతో పాటు సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాలు కూడా ఉల్లంఘనకు గురయ్యాయని పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ- గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేశారు. విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.

ప్రత్యేక ధర్మాసనం..
ఇప్పుడు తాజాగా అదే అంశంపై సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది. బిల్కిస్ బానో రేపిస్టుల ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను విచారించడానికి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పాటు కాబోయే బెంచ్ కు తానే సారథ్యాన్ని వహిస్తాననీ స్పష్టం చేశారు. బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా చేసిన వాదనలతో ఆయన ఏకీభవించారు. వీలైనంత త్వరగా దీన్ని లిస్టింగ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కేసును వాదిస్తోన్న బెంచ్ నుంచి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications