కేంద్రం వైఖరిపై తేల్చేయనున్న సుప్రీంకోర్టు- రేపే
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు తీవ్రతరం అవుతూ వస్తోన్నాయి. అనేక కీలక కేసులను ఈ రెండు సంస్థలు విచారిస్తోన్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సహా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంచలన కేసులపై దృష్టి సారించాయి ఈ రెండు సంస్థలు కూడా. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను.. వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలపై మాత్రమే వాటిని ప్రయోగిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు.
ఆయా కేంద్రీయ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైనే ప్రయోగిస్తోండటం దీనికి ప్రధాన కారణం. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్) వంటి ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులనే లక్ష్యంగా చేసుకోవడం, వారి నివాసాలపై దాడులు చేయడం, అరెస్టులకు దిగడం.. వంటి పరిణామాలు దేశంలో చోటు చేసుకుంటోన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వెళ్లట్లేదనేది వారి ఆరోపణ.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ప్రతిపక్షాలపైనే సీబీఐ, ఈడీ, ఐటీ అధికారుల దాడులు సాగుతున్నాయని విమర్శిస్తోన్నారు. బీజేపీ నేతల ఇళ్లపై ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీస్తోన్నారు. బీజేపీలో ఉన్నవాళ్లు అవినీతిపరులు కదా? అంటూ నిలదీస్తోన్నారు. ఈ క్రమంలో పలువురు నాయకుల పేర్లను వారు ఉటంకిస్తోన్నారు.
గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వంటి టీడీపీ నాయకుల ఇళ్లపైనా ఐటీ అధికారులు దాడులు సాగించారు. వారందరూ బీజేపీలోకి చేరిన తరువాత హఠాత్తుగా ఆయా తనిఖీలు, దాడులు ఎక్కడికక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని జాతీయ పార్టీలు ప్రస్తావిస్తోన్నాయి. ఇటీవలే అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా బీజేపీలో చేరాలని, అలా చేస్తే కేసులన్నీ మాఫీ అవుతాయంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారనే వాదనలు కూడా లేకపోలేదు.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీల అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని, దీనిపై సరైన మార్గదర్శకాలను జారీ చేయాలంటూ 14 ప్రతిపక్ష పార్టీలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయి. ఈ పిటీషన్లు ఇప్పుడు విచారణకు వచ్చాయి. బుధవారం వాటిని లిస్టింగ్ చేసింది సుప్రీంకోర్టు. సమగ్రంగా విచారణ చేపట్టబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం- ఈ విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications