ఏం.. దేశం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా: తలంటిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న
దేశంలో వివిధ నగరాల పేర్లను మార్చాలంటూ బీజేపీ నాయకుడు, సీనియర్ అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల పేర్లను మార్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్ ను తలంటింది. దేశం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా? అంటూ సూటిగా ప్రశ్నించింది. సువిశాల భారత దేశం ఎప్పుడూ మండుతూనే ఉండాలని కోరుకుంటోన్నారా? అంటూ నిలదీసింది. నగరాల పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూత్వం గొప్పదనాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దని హితవు పలికింది.

పేర్లు మార్పుపై..
భారతీయ జనతా నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. లోధి, ఘజిని, ఘోరీ.. ఇలా భారత్ పై దండయాత్ర చేసిన వారి పేర్లు దేశంలో పలు నగరాలు, రోడ్లకు ఉన్నాయని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇంద్రప్రస్థ, యుధిష్టిర్, పాండవుల పేర్లు ఏ నగరానికీ లేవని చెప్పారు. దేశాన్ని దోచుకున్న వారి పేరుతో ఫరీదాబాద్ వెలిసిందని అన్నారు. ఔరంగజేబు, లోధి, ఘజిని.. వంటి వారికి భారత్ తో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు.

దేశం మండుతూనే ఉండాలా?
ఈ పిటీషన్ ఇవ్వాళ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతియుత వాతావరణానికి దారి తీసే ఇలాంటి వివాదాస్పద అంశాలను ఇంకా సజీవంగా ఉంచాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తోన్నారా? అని నిలదీశారు.

హిందూయిజం గొప్పదనం..
పేర్ల మార్పుతో హిందూయిజం గొప్పదనాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దని న్యాయమూర్తులు.. ఆయనకు సూచించారు. హిందుత్వం అంటే ఓ సమగ్ర జీవన విధానమని, అందుకే దేశంలో మనం కలిసి జీవించగలుగుతున్నామని అన్నారు. ఈ దేశాన్ని బ్రిటీషర్లు విభజించి- పాలించారని, అలాంటి ధోరణిని ఎప్పటికీ సమర్థనీయం కాదని చెప్పారు. మతం ప్రాతిపదికన ప్రజలు జరుపుకొనే పూజలకు, రోడ్లకు ఏం సంబంధం ఉందని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు.

దండయాత్రలను కోరకుంటోన్నారా?
దేశం అనేకసార్లు ఆక్రమణలకు గురైన మాట వాస్తవమే అయినప్పటికీ.. అలాంటి దండయాత్రలను ఇప్పుడెవరూ కోరుకోవట్లేదని జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు, దండయాత్రల గురించి ఇప్పుడు ఆలోచించడం సరైనదేనా? అని ప్రశ్నించారు. అంతకుమించిన ఇతర సమస్యలు మనకు లేవని అనుకుంటున్నారా? అని నిలదీశారు. ఇలాంటి పిటిషన్లతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయొద్దని హితవు పలికారు. మతం గురించి కాకుండా దేశం సమగ్రతను దృష్టిలో పెట్టుకోండని హితబోధ చేశారు. హిందూత్వం ఒక జీవన విధానం.. అందులో మతోన్మాదం లేదు.. అని స్టిస్ నాగరత్న పునరుద్ఘాటించారు.

నేను క్రిస్టియన్ ను..
హిందూ మతం అతి గొప్పదని జస్టిస్ కేఎం జోసెఫ్ అన్నారు. ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీతలో హిందూమతంలో ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పాయని, దీనికి సమానమైనది ఏదీ లేదని పేర్కొన్నారు. అందుకు మనం గర్వపడాలని చెప్పారు. దీన్ని తక్కువ చేయవద్దని సూచించారు. హిందూమతం గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. తాను క్రిస్టియన్ నే అయినప్పటికీ.. హిందూమతం అంటే అంతే చాలా ఇష్టమని జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు. హిందూ తత్వశాస్త్రంపై డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ రచనలను చదవాలని సూచించారు.












Click it and Unblock the Notifications