అయోధ్య రామయ్యకు సూర్యతిలకం- ఎప్పుడు..? సూర్య తిలకం విశిష్టత ఏంటి..?
చైత్రశుద్ధ నవమి హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు ఏడో అవతారంగా భావిస్తారు. దీనినే రామ నవమి అంటారు. శ్రీ విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. భగవాన్ శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. శ్రీరామనవమి సందర్భంగా ఆ అయోధ్య నగరం ముస్తాబవుతోంది. నవమి వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది.

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బాలరామయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దుతారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాలు బాల రామయ్య నుదిటిపై పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకోనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఈ దృశ్యాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు.

మరోవైపు మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా అయోధ్యలో రామ కథ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. శ్రీరామనవమి వేడుకలను భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్య తిలకం విశిష్టత ఇదే..!
దశరధ రాజు తనయుడు శ్రీ రాముడు సూర్యవంశీయుడు. ఇక్ష్వాకు వంశ కుల దైవం సూర్య నారాయణుడు. చైత్ర మాసం శుక్ల పక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడని పురాణాలను బట్టి తెలుస్తోంది. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు తన కిరణాలతో శ్రీరామునికి తిలకం దిద్దడంతో రామునిలోని దైవత్వం మేల్కొంటుందని భక్తులు అమితంగా విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications