పాట్నాపేలుళ్లు: హీరోయిన్‌తో షిండే ఫోజులు!, విమర్శలు
న్యూఢిల్లీ: బీహార్ రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సినిమా ఆడియో వేడుకలో పాల్గొనడం వివాదానికి దారి తీసింది. ఆదివారం మూడు గంటల వ్యవధిలో పాట్నాలో ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించగా, ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీకి ముందు ఈ ఘటన జరిగింది. అయితే పాట్నా పేలుళ్ల ఘటన అనంతరం షిండే ముంబైలో ఓ సినిమా పాటల వేడుకలో పాల్గొనడంపై బిజెపి, ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి.

షిండేపై బిజెపి నేత కీర్తీ ఆజాద్ మండిపడ్డారు. షిండే చేయడానికి ఏమీ లేదని, ప్రధాని మన్మోహన్ సింగ్‌లా నవ్వడం మినహా ఆయనేమీ చేయలేరన్నారు. పాట్నా పేలుళ్లలో అమాయకులు మృత్యువాత పడితే షిండే ఆడియో ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ గడిపారని విమర్శించారు. మరో రెండు వందల రోజుల్లో ఈ ప్రభుత్వం పోతున్నందున తాను ఆయన రాజీనామాను అడగదల్చుకోలేదన్నారు.
పాట్నాలో పేలుళ్లు జరుగుతుంటే షిండే పాటల విడుదల కార్యక్రమంలో ఎంజాయ్ చేశారని సిపిఐ నేత అతుల్ అంజన్ విమర్శించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. పాట్నా పేలుళ్లతో వణుకుతోంటే షిండే మ్యూజిక్ ఫంక్షన్‌లో ఉన్నారని ట్వీట్ చేశారు. ఇంత బాధ్యతారాహిత్యమా అంటూ విపక్షాలు మండిపడ్డాయి.
కాగా, షిండే బాలీవుడ్ నటి కంగానా రనౌత్ నటించిన రజ్జో సినిమా ఆడియోను ఆదివారం ఆవిష్కరించారు. సినిమా దర్శకుడు విశ్వాస్ పాటిల్, షిండేలు ఒకే గ్రామానికి చెందిన వారు. ఆడియో రిలీజ్ చేసి చిత్ర కథానాయిక, ఇతరులతో షిండే ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు షిండే దీనిపై స్పందించారు. పేలుళ్ల గురించి తాను చేయాల్సింది చేశానని, ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూనే ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications