షిండేకు చుక్కెదురు.. ఫడ్నవిస్ ఏకగ్రీవం: ముహూర్తం ఖరార్
New Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై 10 రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఖరారైంది. కొద్దిసేపటి కిందటే- భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బీజేఎల్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు.
ఈ ఉదయం మహారాష్ట్ర శాసన సభ ఆవరణలోని కమిటీ హాలులో సమావేశమైంది బీజేఎల్పీ. పార్టీ కేంద్ర పరిశీలకులు నిర్మల సీతారామన్, విజయ్ రుపాణీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ భేటీకి హాజరయ్యారు. దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రశేఖర్ బవాన్‌కులె, ఆశీష్ షెలార్ సహా కొత్తగా ఎన్నికైన 132 మంది శాసన సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ రుపాణీ- బీజేఎల్పీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించారు. ఆశీష్ షెలార్ దీన్ని బలపరిచారు. ఆ వెంటనే ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రుపాణీ ప్రకటించారు. దీనితో కమిటీ హాల్ మొత్తం కూడా చప్పట్లతో మార్మోగిపోయింది. నిర్మల సీతారామన్ ఆయనను అభినందించారు.
ఆయన ఎంపికతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవిస్ పేరును ఖరారు చేసినట్టయింది. మహాయుటిలో మిత్రపక్షాలైన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) ఇక అనివార్యంగా ఫడ్నవిస్ పేరును సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది.
ముఖ్యమంత్రి అభ్యర్థి తేలడంతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముంబైలోని ప్రఖ్యాత ఆజాద్ మైదాన్‌లో ఇప్పటికే దీని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం సరిగ్గా 5:30 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తాన్ని నిర్ణయించారు.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఫడ్నవిస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులూ ప్రమాణ స్వీకారం చేస్తారు.












Click it and Unblock the Notifications