తల్లి మరణించిన వేళ- ప్రధాని మోదీకి మమత బెనర్జీ కీలక సూచన..!!
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే గుజరాత్ అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స తీసుకుంటోన్న సమయంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ- ఆ తరువాత విషమించింది. డాక్టర్లు అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

యథాతథంగా అధికారిక కార్యక్రమాల్లో..
తల్లి పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించిన అనంతరం- ప్రధాని మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఇవ్వాళ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో అధికారిక కార్యక్రమాల్లో నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లో 7,800 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. హౌరా-న్యూ జల్‌పాయ్ గురి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు.

మీ అమ్మ.. మా అమ్మ..
ఈ సందర్భంగా కోల్ కతలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, పలువురు రాష్ట్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీని ఉద్దేశించి మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అమ్మ మా అమ్మగా అభివర్ణించారు. కొంచెం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తల్లి మరణానికి ఎలా సంతాపం తెలియజేయాలో తనకు తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హీరాబెన్ కన్నుమూసిన ఘటన తన తల్లిని గుర్తు చేసిందని పేర్కొన్నారు.

బీజేపీ నాయకుల వైఖరితో..
మహోజ్వలమైన శతాబ్ది ఉత్సవాలను జరుపుకొని హీరాబెన్ భగవంతుని పాదాల చెంతకు చేరారని మమత బెనర్జీ పేర్కొన్నారు. మోదీ ప్రారంభించిన అయిదు రైల్వే ప్రాజెక్టుల్లో నాలుగింటి పనులు తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించినట్లు మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ పరిణామం మమత బెనర్జీని అసహనానికి గురి చేసింది.

వేదిక ఎక్కని మమత..
వారితో వేదికను పంచుకోవడానికి మమత బెనర్జీ ఏ మాత్రం ఇష్ట పడలేదు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించాల్సిన సభా వేదికపై వెళ్లడానికి మమతా బెనర్జీ నిరాకరించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెను వేదికపైకి తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. బీజేపీకి అనుకూలంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడం అటు అశ్విని వైష్ణవ్ ను కూడా ఇబ్బందులకు గురి చేసినట్టయింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినందున నినాదాలు చేయొద్దని సూచించారు.












Click it and Unblock the Notifications