డిప్యూటీగా కొడుకును ప్రమోట్ చేసిన సీఎం: కొలువుదీరిన కొత్త కేబినెట్
Udayanidhi Stalin: పొరుగునే ఉన్న తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా కేబినెట్‌లోకి నలుగురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
కొద్దిసేపటి కిందటే చెన్నైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ ఎన్ రవి.. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా అపాయింట్ చేశారు. కీలక శాఖలను అప్పగించారు.

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ, డాక్టర్ గోవి ఛేజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ ఎం నాజర్ ఉన్నారు. ఇదివరకు స్టాలిన్ మంత్రివర్గంలో సెంథిల్ బాలాజీ కొనసాగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేయడం, విచారణను ఎదుర్కొనాల్సి రావడం వల్ల తన పదవికి రాజీనామా చేశారు.
ఇటీవలే ఆయనకు బెయిల్ లభించింది. దేశ అత్యన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. దీనితో సెంథిల్ బాలాజీని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.
కాగా డాక్టర్ కే పొన్ముడి, వీ మెయ్యనాథన్, ఎన్ కే సెల్వరాజ్, డాక్టర్ ఎం మథివంథన్, ఆర్ఎస్ రాజకన్నప్పన్, తంగం తెన్న అరసును తప్పించారు. వారిపై వేటు వేశారు. వారి స్థానంలో కొత్తగా నలుగురికి చోటు దక్కింది. కొత్త మంత్రివర్గంలో శాఖల అప్పగింతకు సంబంధించిన జీవో ఈ సాయంత్రం నాటికి వెలువడే అవకాశం ఉంది.
కాగా- ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడం పట్ల డీఎంకే నాయకులు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంకే కార్యాలయాల వద్ద పండగ వాతావరనం నెలకొంది.












Click it and Unblock the Notifications