జయ: చెన్నైకి లండన్ వైద్యుడు, బర్తడే కి కమల్ దూరం
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్సలు అందించేందుకు లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుడు గిల్సాని మళ్లీ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు. వీరితో పాటు సింగపూర్ కు చెందిన వైద్యులు అమ్మకు వివిధ రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
జయలలిత అనారోగ్యంతో గత నెల 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరారు. సింగపూర్ కు చెందిన మహిళా వైద్యులు గత వారం రోజుల నుంచి జయలలితకు ఫిజియోథెరఫీ చికిత్సలు చేశారు. ఆ చికిత్సకు జయలలిత స్పందించారు. జయలలిత స్పందిస్తున్న తీరును అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా చికిత్స చేస్తున్నారు.
దీంతో జయ ఆరోగ్యం మరింత కుదటపడిందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. దీపావళి లోపు ఇంటికి వెళ్లాలని జయలలిత అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. అయితే ఆమె ఇంకా 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ ఊపిరితిత్తుల సంబంధిత డాక్టర్ గిల్నాని చెన్నై వచ్చారు. ఆదివారం కేరళ మాజీ సీఎం ఉమన్‌చాంది, సీనియర్ నటి లత జయలలితను పరామర్శించారు. తరువాత కేరళ మాజీ సీఎం ఉమన్‌చాంది మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర మంత్రులు, ఆస్పత్రి వర్గాలతో జయలలిత ఆరోగ్యం గురించి విచారించానని అన్నారు.
అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉమన్ చాందీ చెప్పారు. సీనియర్ నటి లత మీడియాతో మాట్లాడుతూ తాను పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులతో మాట్లాడానని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడ్డట్టు వారు చెప్పారని అన్నారు.
సింగపూర్ ఉప ప్రధాని సలహాదారు కోష్యా కూడా చెన్నై చేరుకుని జయలలితను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా అపోలో ఆసుపత్రికి వచ్చి జయలలితను పరామర్శించానని, ఆమె త్వరగా కోలుకుంటారని మీడియాకు చెప్పారు.

పుట్టిన రోజు వేడుకలు వద్దు: కమల్ హాసన్
మన ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఉన్నారని, ఈ సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించరాదని జాతీయ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు కమల్ హాసన్ అభిమానులకు మనవి చేశారు. ఈ సమయంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం సబబుకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నవంబర్ 7వ తేదిన కమల్ హాసన్ పుట్టిన రోజు. ఆ రోజు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆమన అభిమానులు భారీ స్థాయిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంలో కమల్ హాసన్ ట్విట్టర్ లో తన అభిమానులకు ఈ విధంగా మనవి చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆయన కాక్షించారు.
అమ్మ ఓకే: సీఆర్ సరస్వతి
అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, సినీనటి సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఆరోగ్యం మరింతగా మెరుగుపడిందని, త్వరలో ఇంటికి చేరుకుంటారని ఆమె చెప్పారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని తమిళనాడువ్యాప్తంగా ఆదివారం కూడా అన్నాడీఎంకే వర్గాలు పూజలు చేశారు.












Click it and Unblock the Notifications