వైఎస్ జగన్‌ను ట్రెండ‌్‌ను ఫాలో అవుతున్న స్టాలిన్: పోలీసులకు వీక్లీ ఆఫ్: జీవో జారీ
చెన్నై: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పోలీస్ శాఖకు వీక్లీఆఫ్ విధానాన్ని తమిళనాడు సర్కార్ ప్రవేశ పెట్టింది. పోలీస్ శాఖకు కొత్తగా వీక్లీ ఆఫ్‌లను ఇచ్చే విధానానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. గ్రేడ్-2 స్థాయి కానిస్టేబుల్స్ మొదలుకుని హెడ్ కానిస్టేబుల్స్ వరకు పోలీసులందరికీ దీన్ని వర్తింపజేసింది.

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు
దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ కావడం పట్ల పోలీసు ఉద్యోగుల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను ఇస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సెప్టెంబర్ 13వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ హామీని ఇచ్చారు. దాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చారు. తమిళనాడు హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి.. దీనికి సంబంధించిన జీవోను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.

ఒత్తిడిని తగ్గించడానికి..
పోలీసు కానిస్టేబుళ్లపై ఒత్తిడిని నివారించడానికి తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్టాలిన్.. అప్పట్లో సభలో ప్రకటించారు. పోలీసులకు మానసిక, శారీరక విశ్రాంతిని కల్పించడానికి నిర్ణయించామని తెలిపారు. కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుగా వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఈ మధ్యాహ్నం జీవో జారీ అయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తాము ఈ జీవోను విడుదల చేశామని తమిళనాడు హోం శాఖ ముఖ్య కార్యదర్శి.. ఇందులో పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగుల సంఘం హర్షం..
ఈ ఉత్తర్వులు జారీ కావడం పట్ల తమిళనాడు పోలీసు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు రిటైర్డ్ పోలీసులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సమయానుకూలంగా పోలీసులకు విధుల నిర్వహణ నుంచి కొంతమేరకైనా విశ్రాంతిని కల్పించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేయాలంటూ దీర్ఘకాలం నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని, అది కార్యరూపం దాల్చడం సంతోషాన్ని ఇస్తోందని పోలీసు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చెప్పారు.

98 వేల మందికి పైగా..
పోలీస్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ స్థాయి ఉద్యోగి నుంచి గ్రేడ్-2 కానిస్టేబుళ్ల వరకు దీన్ని వర్తింపజేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఇప్పటి నుంచి ప్రతి పోలీస్ కానిస్టేబుల్‌కు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ లభిస్తుంది. ఆ రోజు విధి నిర్వహణకు హాజరు కావాల్సి వస్తే.. దాన్ని ఎక్స్‌ట్రా డ్యూటీగా పరిగణిస్తుంది ప్రభుత్వం. దానికి అవసరమైన వేతనాన్ని అదనంగా చెల్లిస్తుంది. తమిళనాడు క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం.. 1,00,932 మంది అన్ని స్థాయిల్లో పోలీసు ఉద్యోగులు పని చేస్తోన్నారు. వారిలో 98,000 మందికి పైగా ఈ వీక్లీ ఆఫ్స్ వర్తిస్తాయని సమాచారం.

ఏపీలో రెండేళ్ల కిందటే..
ఏపీలో ఈ విధానం రెండేళ్ల నుంచీ అమల్లో ఉంటోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల్లోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2019లో జూన్‌లో దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించిన ముసాయిదాను ఆమోదించాలని అప్పట్లో జగన్ సర్కార్ తీర్మానించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అమలు కావడం, వారిపై మానసిక, శారీరక ఒత్తిళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా అనుసరించింది












Click it and Unblock the Notifications