తమిళనాడు: కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటున్న 'చదివింపుల విందు'

చదివింపుల విందు. తమిళనాట ఈ సంప్రదాయం రెండు జిల్లాల్లో కష్టకాలంలో ఉన్న ఏంతో మందికి ఆర్థిక సాయం అందిస్తోంది, కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారికి పెట్టుబడిని అందిస్తోంది.
తమిళంలో 'నోయ్ విరుందు' అనే ఈ బంతి భోజనాల ఏర్పాట్లు ఎంతోమందికి ఉపాధిని, కొత్త ఉద్యోగ అవకాశాలను అందించడంతోపాటూ ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని కూడా పెంచుతోంది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడడం నేర్పుతోంది.
తమిళనాడులోని తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ప్రతి ఏటా జరిగే ఈ చదివింపుల విందుల్లో పండుగ వాతావరణం అందరినీ ఆకర్షిస్తోంది.
కరోనా, గజ తుపాను ప్రభావంతో గత రెండేళ్లుగా ఇవి కనిపించకపోయినా, ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడంతో ఈ గ్రామాల్లో మళ్లీ ఈ చదివింపుల విందుల హడావిడి మొదలైంది.
తంజావూరు జిల్లాలోని పెరవూరని, పుదుక్కోట్టై జిల్లాలోని కీరమంగళం రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉంటాయి. ఈ గ్రామాల్లో ఇప్పుడు చదివింపుల విందుల సందడి బాగా కనిపిస్తోంది.
గతంలో 2019లో ఒక వ్యక్తి చికెన్, మటన్‌తో చదివింపుల విందు ఇచ్చారు. ఆయన విందు ఆరగించడానికి వచ్చినవారు ఆయనకు భారీగా చదివింపులు ఇచ్చారు. దీంతో ఆయన ఏకంగా 4 కోట్ల మొత్తం అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కరోనా వల్ల 2020లో ఒకటి, రెండు చోట్ల ఈ చదివింపుల విందులు జరిగాయి. గత ఏడాది కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు తీసుకోవడంతో పెళ్లిళ్లు లాంటి వేడుకలకు తక్కువ మందిని అనుమతించారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడకుండా జిల్లా కోర్టు ఈ చదివింపుల విందులను కూడా నిషేధించింది.
ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో తంజావూరు జిల్లా పెరవూరని, తిరుచిరంబాలం, పుదుకోట్టై జిల్లాలోని కొత్తమంగళంలో ఈ చదివింపుల విందులు జరుగుతున్నాయి. ఇంకా చాలా గ్రామాల్లో ఈ విందులకు తేదీలు నిర్ణయించుకుంటున్నారు.
- ఇక్కడ మనుషులతో కలిసి ఏనుగులు ఎలా హాయిగా జీవిస్తున్నాయి?
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన

చదివింపుల విందు అంటే
తమిళంలో మెయ్ అంటే తెలుగులో చదివింపులు అని అర్థం. సాధారణంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు జరిగినపుడు బంధుమిత్రులు వచ్చి వధూవరుల తరఫున తమకు తోచినంత డబ్బు లేదా, వస్తువుల చదివిస్తుంటారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో రాసుకుని, మైక్‌లో అనౌన్స్ కూడా చేస్తుంటారు.
ఆ పెళ్లి వారు తర్వాత తమకు చదివించిన వారి ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు జరిగినపుడు అదే మొత్తాన్ని తిరిగి చదివిస్తుంటారు.
ఇప్పుడు అదే పద్ధతిని తమిళనాడులోని ఈ గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.
ఎవరైనా కష్టాల్లో ఉండి ఆర్థిక సాయం అవసరమైనా, ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లాంటివి కావాలన్నా, వేరే ఇంకేదైనా అవసరం ఉన్నా ఇలా భారీగా విందు నిర్వహించి, వచ్చిన వారు తమకు తోచినంత ఇస్తే దానితో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
- హాజీ మస్తాన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- అబ్దుల్ కలాం: ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది

విందులో పండగ కళ
ఈ విందు ఇచ్చేవారు వివాహాలు, మిగతా శుభకార్యాలకు వేసినట్లే ఆహ్వాన పత్రికలు వేయిస్తున్నారు. అతిథులను ఆహ్వానించే బ్యానర్ల నుంచీ విందు కోసం మండపాలు, వంటవాళ్లను బుక్ చేయడం వరకూ భారీగా ఏర్పాట్లు చేస్తారు.
విందు ఇచ్చే ప్రాంతంలో వండివార్చి రాశులు పోసిన అన్నం, స్టవ్వుల మీద పెద్ద పెద్ద గిన్నెల్లో ఉడుకుతున్న మటన్, చికెన్ సువాసన ఉంటుంది. బంతి భోజనంలో అరటి ఆకుల్లో వడ్డిస్తున్న పదార్థాలు చూడగానే నోరూరిపోతుంది.
మొత్తంగా చూస్తే ఈ విందు చాలా ప్రత్యేకమైనది. కరోనా ఆంక్షలు క్రమంగా సడలించి వీటికి అనుమతి ఇస్తుండడంతో ఈ విందులు మళ్లీ పెరుగుతున్నాయి.
తమిళనాట ఈ విందులు సాధారణంగా జులై-ఆగస్టు మధ్యలో వచ్చే తమిళ ఆడి మాసంలో జరుగుతాయి.
ఒకేసారి ఎక్కువమంది ఇలాంటి విందులు ఇవ్వకుండా కొన్ని కట్టుబాట్లు కూడా ఉంటాయి. ఒకరు ఒకసారి చదివింపుల విందు ఇస్తే ఐదేళ్ల తర్వాతే మరోసారి ఇవ్వాలి. ఇదంతా గ్రామస్థులే కలిసి నిర్ణయించుకుంటారు.
''మొయి పార్టీలు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో తంజావూరు జిల్లాలోని పెరవూరని ప్రాంతంలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు పుదుకోట్టై జిల్లాలోని గ్రామాల్లోనూ కొనసాగుతోంది" అని కొత్తమంగళానికి చెందిన సురేష్ బీబీసీతో అన్నారు.
"ప్రతి ఏటా ఆడి(జులై-ఆగస్టు) మాసంలో ఈ విందులు జరుగుతాయి. ఆ రెండు నెలల్లో బంధువులు వస్తారు. కానీ రెండేళ్లుగా కరోనా వల్ల అవి జరగలేదు. దీంతో గత ఏడాది వాటిని అనుకున్నవారు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పెడుతున్నారు. ఒకసారి చదివింపుల విందు ఇచ్చినవారు ఐదేళ్ల తర్వాతే మళ్లీ అది నిర్వహించాలి. ఈ మధ్యలో తమ డబ్బు తిరిగి పొందడానికి, ఆర్థిక సాయం కోసం వేరేవారు ఇలాంటి విందులు ఇస్తుంటారు"
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- రాజీవ్ గాంధీ చివరి రోజు : ''నా కళ్ల ముందే బాంబు పేలింది''

పెట్టుబడి సహాయం కోసం భోజనాలు
ఇప్పుడు పది మందికి పైగా ఈ విందును వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడిగా ఇస్తున్నారు. ఈ విందుకు సంబంధించిన ఖర్చులన్నీ వారు పంచుకుంటారు. విందు ద్వారా వచ్చిన చదివింపుల మొత్తాన్ని కూడా పంచుకుంటారు అని సురేష్ చెప్పారు.
2018లో గజ తుపానుకు ముందు జరిగిన చదివింపుల విందుల వల్ల ఈ మొత్తం ప్రాంతాల్లో కలిపి దాదాపు రూ.500 కోట్ల చదివింపులు వచ్చుంటాయని చెబుతున్నారు.
వ్యాపారం ప్రారంభించడానికి, ఇల్లు కట్టుకోడానికి, కారు కొనడానికి, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, పెళ్లిళ్లు లాంటి శుభకార్యాల కోసం, ఇంకా ఎన్నో అవసరాల కోసం ఈ చదివింపుల విందులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విందు ఇవ్వాలనుకునేవారికి ఖర్చుల కోసం బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయి.
"ఈ విందు ద్వారా ఆర్థిక సాయం పొందిన వారు ఎవరెవరు ఎంతెంత మొత్తం ఇచ్చారో వివరంగా రాసి ఉంచుకుంటారు. తర్వాత దానిని ఐదేళ్లలో వారందరికీ తిరిగి ఇచ్చేస్తారు. అందుకే ఇది సంప్రదాయం మాత్రమే కాదు, కలిసి ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో చెప్పే మార్గం కూడా" అంటారు సురేష్.
- చెన్నై సిక్స్: 'చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ నేతలు చెబుతున్నట్లు 'వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా' ఎగురుతుందా?

విందులతో కొత్తగా ఉపాధి అవకాశాలు
చదివింపుల విందుకు మొదట్లో ఆహ్వానాలు, వంటలు చేయడం, వడ్డించడం, చదివింపుల వివరాలు రాయడం లాంటివి ఆతిథ్యం ఇచ్చేవారి బంధువులే చేసేవారు.
కాలక్రమేణా ఇప్పుడు విందుల్లో ఈ పనులు కొంతమందికి ఉపాధి అందిస్తున్నాయి. చికెన్, మటన్ వ్యాపారం, కిరాణా షాపుల్లో అమ్మకాలు, అరటి ఆకులు, మండపాల నిర్వాహకులు, వంటవాళ్లు, వెయిటర్లు, చదివింపులు రాయడం లాంటి వాటితో చాలా మంది ఉపాధి పొందుతున్నారు.
దురై మురుగన్ పుదుక్కోట్టై జిల్లా అలంగుడిలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. ఏడాది అంతా జరిగే వ్యాపారం కంటే ఈ రెండు నెలల్లో తనకు విందు ఆహ్వాన పత్రికల కోసం ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పారు.
ఆయన దగ్గర ప్రస్తుతం 10కి పైగా విందు ఆహ్వానాలు ప్రింట్ చేసే ఆర్డర్ ఉంది. ఇవి మాత్రమే కాదు, బానర్లు, ఫ్లెక్సీలు ప్రింటింగ్ పనుల ద్వారా మురుగన్ ఈ సీజన్లో మరింత సంపాదిస్తున్నారు.
అంతే కాదు, ఈ విందు ఆహ్వానాలను ఇంటింటికీ వెళ్లి అందించే గ్రూపులు కూడా ఉన్నాయి. దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.20 వరకూ వసూలు చేసే విద్యార్థులు, యువకుకు ఈ పనులు చేస్తుంటారు.
చదివింపుల విందులు మళ్లీ ప్రారంభం కావడంతో చాలా మందికి డబ్బు సంపాదించగలం అనే భరోసా లభించింది అంటారు దురై మురుగన్.
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు: 'రెండు నెలల్లో పేదలు ధనికులుగా మారారా?’

చదివింపులు రాస్తున్న గ్రాడ్యుయేట్లు
ఈ విందుల్లో డబ్బు చదివించే సమయంలో నిరుద్యోగులైన యువకుల ఆ వివరాలు రాస్తూ ఉపాధి పొందుతున్నారు.
"నేను ఎంఏ బీఈడీ చేశాను. ఆయన వందులో వచ్చే చదివింపుల డబ్బు తీసుకుని వారి పేరు, చిరునామా నోట్‌లో వివరంగా రాస్తాను. నా పక్కనే ఉన్న వ్యక్తి డబ్బు తీసి పెట్టుకుంటాడు. మొత్తం డబ్బు తీసుకున్న తర్వాత అదంతా జాగ్రత్తగా రాసి, లెక్క చూపించి వెళ్లిపోతాం. కొన్ని గంటల ఈ పనికి వెయ్యి రూపాయలు ఇస్తారు" అని ఒక విందులో చదివింపులు రాయడంలో బిజీగా ఉన్న రాజన్ చెప్పారు.
ఇది జరిగే నెలల్లో ఇలాంటి 50 విందుల్లో చదివింపులు రాసే అవకాశం వస్తుందని, తనలాంటి ఎంతోమంది ఆ పని ద్వారా సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు.
- ఆళ్లగడ్డ పోలీసులు: 'కేసులు పెరుగుతున్నాయని శాంతి పూజలు చేశారు, దోష నివారణకు గోమూత్రం చల్లారు’
- యుక్రెయిన్లోనే ఏపీ వైద్యుడు: జాగ్వర్, పాంథర్లతో కలిసి బేస్మెంట్లోనే జీవనం

వంట వాళ్ల అనుభవం ముఖ్యం
ఈ చదివింపుల విందులో ముఖ్యంగా కావల్సింది రుచికరమైన వంటకాలు, వడ్డన. ఆ పనికోసం ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. వంటలు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది.
"నేను చాలా సంవత్సరాలుగా వంటలు చేసే పనిలో ఉన్నా. చదివింపుల విందులో నాకు చాలా పనుంటుంది. ఒకే రోజు రెండు మూడు విందుల్లో వంటలు చేయాల్సిన ఆర్డర్ వస్తుంది. కానీ మేం పూర్తి చేయగలిగేవాటినే మేం ఒప్పుకుంటాం అని ఈ విందుల్లో వంటలు చేసే ముత్తరసు చెప్పారు.
"వంటలు చేసి, వడ్డించడానికి ఒక్కోసారి 50 మంది కూడా పనిచేస్తుంటారు. కానీ, ఈరోజు విందులో 20 మందికే పనిదొరికింది. ఈ విందు సీజన్ అంతా మాకు బాగా పనిదొరుకుతుంది. మంచి ఆదాయం కూడా ఉంటుంది. గత రెండేళ్లుగా అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ పనినే కొనసాగించాలనుకుంటున్నారు. ఎందుకంటే వంటలు చేస్తేనే మా పొట్ట గడుస్తుంది" అంటారు ముత్తరశు.
- ఆంధ్రప్రదేశ్: కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌ను లీజుకు ఎందుకిస్తున్నారు, వ్యతిరేకించేవారి వాదనేంటి?
- సౌదీ నుంచి అమెరికా దాకా... ఆంధ్ర అరటి అంటే ఎందుకంత డిమాండ్?

చదివింపుల విందులపై ఆసక్తి తగ్గిందా?
కానీ, వివిధ కారణాల వల్ల గత కొన్నేళ్లతో పోలిస్తే చదివింపుల విందులపై ఆసక్తి తగ్గుతూ వస్తోంది.
ముఖ్యంగా 2018లో వచ్చిన గజ తుపాను తర్వాత అవి ఇచ్చేవారి సంఖ్య తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.
"ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. కొబ్బరి ఆధారిత వ్యవసాయం చాలా వరకు జరిగింది. గజ తుపాను ధాటికి వేలాది చెట్లు నేలకొరిగాయి. దీంతో చాలా మంది రైతులు దివాలా తీశారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కరోనా వల్ల ఆర్థికంగా మరింత చితికిపోయారు. అలాంటి సమయంలో విందు పెడితే, వచ్చే చదివింపులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఇలా విందు ఇస్తే రూ. 3 లక్షల వరకూ వస్తే, ఇప్పుడు రూ.లక్ష వచ్చేదే కష్టంగా ఉంది" అని తిరుచిరాపల్లికి చెందిన షణ్ముగనందన్ చెప్పారు.
అప్పు చేయక తప్పదు అనుకున్న స్థితిలో ఉన్నవారే ఇప్పుడు ఇలాంటి విందులు ఇస్తున్నారు.
చాలా మందికి పెట్టిన ఖర్చుకు తగినంతే వస్తోంది. అందుకే ఈ విందులు ఇచ్చేవారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతోంది అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 365 మంది మహిళలతో డేటింగ్ తన టార్గెట్ అంటున్న యువకుడి అసలు లక్ష్యం ఏంటి?
- హాజీ మస్తాన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications