మైనర్ బాలిక అత్యాచారం కేసులో చారిత్రాత్మక తీర్పు.. 'డబుల్ డెత్ సెంటెన్స్' !!
తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది. 38 ఏళ్ల నిందితుడు ధర్మమునీశ్వరన్ అలియాస్ మావీరన్‌కు 'డబుల్ డెత్ సెంటెన్స్' (రెండు మరణశిక్షలు) విధిస్తూ న్యాయస్థానం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం అందించిన చారిత్రాత్మక తీర్పు ఇది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని విలాతికుళం ప్రాంతంలో 2026 మార్చిలో 17 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు కులత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి.

ఈ దారుణం బయటపడటంతో, పోలీసులు కేసును భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టంలోని కఠిన సెక్షన్ల కిందకు మార్చారు. విలాతికుళంకు చెందిన 38 ఏళ్ల ధర్మమునీశ్వరన్ అలియాస్ మావీరన్‌ను నిందితుడిగా గుర్తించారు. నిందితుడి గురించి ఎలాంటి ఆధారాలూ లేవు. జిల్లా ఎస్పీ పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఒక అనుమానాస్పద ద్విచక్ర వాహనం ఆధారంగా మావీరన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
డీఎన్ఏ పరీక్షల్లో, బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడింది మావీరనే అని శాస్త్రీయంగా నిర్ధారించారు. పోలీసులు ఈ కేసులో వేగంగా స్పందించారు. నిందితుడి అరెస్ట్ అయిన 21 రోజుల్లోనే పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కేవలం 54 రోజుల్లోనే ముగిసింది. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి, నిందితుడు చేసిన నేరం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే హేయమైనదని పేర్కొన్నారు. ధర్మమునీశ్వరన్‌కు వేర్వేరు సెక్షన్ల కింద రెండు మరణశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. తక్కువ సమయంలో విచారణ పూర్తిచేసి బాధితురాలి కుటుంబానికి న్యాయం అందించిన పోలీసుల పనితీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications