తలైవా రజినీకాంత్ కూతురి ఇంట్లోనే- నాలుగేళ్లుగా..ఆ ముగ్గురి పనే..!!
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో చోరీ జరిగింది. ఆమె నగలు, ఇతర ఆభరణాలు మాయం అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో చోరీ జరిగింది. నగలు, వజ్రాలు, ఇతర బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వాటి విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో లాకర్ లో భద్రపరిచిన విలువైన వస్తువులన్నీ కనిపించకుండా పోయాయి. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలు పెట్టారు.
చెన్నై తేనాంపేటలో నివాసం ఉంటోన్నారు ఐశ్వర్య రజినీకాంత్. ఇంట్లోనే లాకర్లను ఏర్పాటు చేసుకున్నారు. బంగారు ఆభరణాలు, నగలు, ఇతర విలువైన వస్తువులను అందులోనే భద్రపరుస్తుండేవారు. అవి మాయం అయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదు చేశారు. చోరీకి గురైనట్లు అనుమానిస్తోన్నారు. కిందటి నెల 27వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఆమె తేనాంపేట పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పనివాళ్లపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

2019లో తన చెల్లెలి వివాహంలో ఆయా ఆభరణాలను తాను ధరించానని, ఆ తరువాత వాటిని ఇంట్లోనే లాకర్ లో భద్రపరిచానని ఐశ్వర్య రజినీకాంత్ తన ఫిర్యాదు పత్రంలో పొందుపరిచారు. ఈ నాలుగేళ్ల కాలంలో లాకర్ ను తెరవలేదని చెప్పారు. చెల్లెలి పెళ్లి తరువాత ఆ లాకర్ ను మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించాల్సి వచ్చిందని వివరించారు. 2021 ఆగస్టు వరకు చెన్నై సెయింట్ మేరీస్ రోడ్ లో గల ఓ అపార్ట్ మెంట్ లో లాకర్ ను ఉంచామని, అనంతరం దాన్ని సీఐటీ కాలనీలోని ఇంటికి షిఫ్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

2022 ఏప్రిల్ 9వ తేదీన ఆ లాకర్ ను పోయెస్ గార్డెన్స్ లోని రజినీకాంత్ ఇంటికి తీసుకెళ్లారు. లాకర్ తాళాలు ఎప్పుడూ తన పర్సనల్ స్టీల్ కప్ బోర్డ్ లో ఉంటాయని, అది వేరే వ్యక్తుల చేతికి వెళ్లదని అన్నారు. కిందటి నెలలో తాను లాకర్ ను తెరిచి చూడగా.. విలువైన వస్తువులేవీ అందులో లేవని కంప్లైంట్ లో రాశారు. కొన్ని వస్తువులు మినహా- డైమండ్ సెట్స్, అన్ కట్ డైమండ్ ఇన్ టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ పీసెస్, నవరత్న సెట్స్, ఫుల్ యాంటిక్ అన్ కట్ డైమండ్ విత్ గోల్డ్ సెట్, నెక్లెస్లు.. అవేవీ లేవని చెప్పారు.

వాటి విలువ 3,60,000 రూపాయల వరకు ఉంటుందని తన కంప్లైంట్ లో పొందుపరిచారు. తన విలువైన వస్తువులన్నీ ఈ లాకర్ లోనే ఉంటాయనే విషయం సిబ్బందికి తెలుసునని అన్నారు. ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అనుమానితులను పిలిచి విచారిస్తామని తేనాంపేట పోలీసులు మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications