జాయింట్ కలెక్టర్ పై గుడ్లురిమిన కడప టీడీపీ ఎమ్మెల్యే..
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కడప శాసన సభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. వివాదాస్పదంగా వ్యవహరించారు. ఓ చిన్న కారణంతో జిల్లా అధికార యంత్రాంగంపై ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
ఈ ఉదయం కడపలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాధవిరెడ్డి హాజరయ్యారు. భర్త ఆర్ శ్రీనివాసరెడ్డితో పాటు ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్టేజీపై ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్తో పాటు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఉన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్టేజీ మీద కుర్చీ వేయలేదని మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీ మీద ఎందుకు కుర్చీ వేయలేదని మాధవీరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని గమనించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్.. ఆమెను శాంతపర్చడానికి ప్రయత్నించారు. ప్రత్యేకంగా మరో కుర్చీవేస్తామని అన్నారు.
మాధవీరెడ్డి వినిపించుకోలేదు. జాయింట్ కలెక్టర్ పై కోపడ్డారు. గుడ్లు ఉరుముతూ గట్టిగా మాట్లాడటం కనిపించింది. భర్త, తన అనుచరులతో కలిసి అక్కడే నిల్చున్నారు. మాధవీరెడ్డి అలాగే నిల్చొనే ఉండటంతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి.. వేదిక దిగి ఆమె వద్దకు వచ్చారు. స్టేజీ మీద కుర్చీ ఏర్పాటు చేశామని, కుర్చోవాలని విజ్ఞప్తి చేశారు.
అయినా ఆమె మెట్టు దిగలేదు. కొంత సమయం పాటు అలాగే నిల్చొనే ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలను వేదిక మీదికి ఆహ్వానించడం ప్రొటోకాల్ కు విరుద్ధమని, అందుకే ఆమెను స్టేజీ మీదికి స్వాగతించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కుర్చీ వేసినా రాలేదని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications