మహిళా జర్నలిస్టును ట్రోల్ చేసిన టీడీపీ..ఆ ట్రోలర్స్‌కు మూడినట్టేనా..?
ఒక కార్యక్రమం కోసం మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి బైకు పై ప్రయాణించడే ఆ మహిళా జర్నలిస్టు చేసిన తప్పు. ఒక జర్నలిస్టుగా తన పని తాను చేసుకోవడమే పాపమైంది.అందుకే కాబోలు జర్నలిస్టు అన్న సంగతి పక్కన పెడితే... ఒక మహిళ అని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రోల్స్ అన్నీ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన సోషల్ హ్యాండిల్స్ నుండి వస్తుండటం మరింతగా ఆలోచింప చేసే అంశం. మహిళా సాధికారత, మహిళాభ్యున్నతి అంటూ గంటల పాటు లెక్చర్లు దంచే రాజకీయ నాయకులు, పార్టీలు ఒక సాటి మహిళపై సోషల్ మీడియా వేదికగా వేధించడం ఎంతమాత్రం హర్షణీయం కాదు.
జనవరి 13వ తేదీన ఓ ప్రముఖ ఛానెల్‌కు చెందిన హసీనా అనే మహిళా రిపోర్టర్ మాజీ మంత్రి కొడాలి నానితో ఓ కార్యక్రమం చేసింది. సంక్రాంతి వేడుకలను కవర్ చేసే భాగంగా కొడాలి నాని నడిపే బైకులో వెనకాలే కూర్చుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలే అక్కడ కొడాలి నాని.. ఇక ఈ ఫోటోను చూసిన తెలుగు తమ్ముళ్లు వదులుతారా చెప్పండి. వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి నానా విధాలుగా కామెంట్స్ చేస్తూ వాటిని ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తూ పైశాచికానందం పొందారు. అటువైపున్నది ఓ మహిళ అనే విషయాన్ని మరిచి హద్దులు దాటారు. ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్‌తో సదరు మహిళా జర్నలిస్టు చాలా ఆవేదనకు గురైందని సమాచారం.

ఇలా బైకుపై కొడాలి నాని వెనక కూర్చుని ఉన్న ఫోటోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేశారు టీడీపీ అభిమానులు కార్యకర్తలు. అసలు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో ఉన్న లోహిత్ ట్విటర్ పై మహిళా జర్నలిస్టు పై అసభ్యకరమైన రీతిలో పోస్టింగ్స్ పెట్టారంటే ఏ స్థాయికి దిగజారారో తెలుస్తోంది. తను 2005 నుంచి ఆ ప్రముఖ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తోందని, తమ ఛానెల్ టీడీపీకి ఎక్కువగా కవరేజ్ ఇవ్వనందున తనను టార్గెట్ చేశారని మహిళా జర్నలిస్టు హసీన ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాదు టీడీపీకి చెందిన చిన్న చిన్న సోషల్ హ్యాండిల్స్ కూడా రీట్వీట్ చేసి తనను వ్యక్తిగతంగా వేధించారని ఆవేదన చెందారు.

ఛానెల్‌తో ఏమైనా సమస్య ఉంటే అది మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకోవాలిగాని, తనను టార్గెట్ చేసి ఇలా చేయడం సరికాదన్నారు హసీనా. తాను ఎన్నో ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసినట్లు గుర్తు చేసిన హసీనా... కేదార్‌నాథ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం వంటివి గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయనని క్లారిటీ ఇచ్చారు. ఇక తనను ట్రోల్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన మహిళా జర్నలిస్టు ఏపీ మహిళా కమిషన్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ఇదిలా ఉంటే మహిళా జర్నలిస్టును వేధించడాన్ని తీవ్రంగా ఖండించాయి పలు జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు. కింది స్థాయి నేతలు, తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాపై ఇలాంటి పోస్టులు చేయడం వల్ల టీడీపీ అధినేత చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు. హసీనాను ట్రోల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిన ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications