• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: ‘చూపు పోయింది.. బిచ్చమెత్తుకుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

''అయ్యో బిడ్డా, నీ కర్మ గిట్లాయెరా. నేను చచ్చిపోయాక ఎలా బతుకుతావురా అని మా నాన్న బాధపడేవారు. వరంగల్ పోయి భిక్షమెత్తితే డబ్బులు వస్తాయని ఏడుస్తూ చెప్పేవారు. నాన్న, నేను బిచ్చమెత్తను. నులక తాళ్లు అల్లి అయినా బతుకుతాను అని ఆ రోజు సమాధానం చెప్పాను.’’

''నా జీవితం ఎలా ఉండబోతోందో అనే బాధ మా నాన్నకు ఉండేది. చూపు పోతే బతుకు ఇంతేనా? అంధులు ఏ పనీ చేయలేరా? అనే ఆలోచనలు మొదట్లో నాలో ఉండేవి.’’

ఊహ తెలియని వయసులోనే చూపు కోల్పోయినా, బావుల్లోని వ్యవసాయ మోటార్లు మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చింతం రాజయ్య తన బాల్యంలో ఎదుర్కొన్న సంఘర్షణ ఇది.

ఆయనది తెలంగాణలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్. ఆయన వయసు 62 ఏళ్లు.

ఐదుగురు తోబుట్టువుల్లో చిన్నవాడైన రాజయ్యకు ఊహ తెలియని వయసులో వచ్చిన కంటి జబ్బుకు నాటు వైద్యం చేయడంతో చూపు కోల్పోయారు. దీంతో రాజయ్య భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆయన తండ్రికి బెంగ పట్టుకున్న సందర్భంలో భిక్షమెత్తాలని సలహా ఇచ్చారు.

ఆయనే నాకు దేవుడు

''అటువంటి పనికి (భిక్షాటనకు) పోవద్దనుకున్నా. నులక మంచాలు, ఎద్దులకు ఉపయోగించే పగ్గం తాళ్లు అల్లడం నేర్చుకోవాలనుకున్నా. అప్పుడే మా ఇంటికి దగ్గర్లో నివసించే, విద్యుత్ శాఖలో హెల్పర్‌గా పనిచేస్తున్న గన్నేరువరం దేవిడి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరే వ్యవసాయ పంప్ సెట్ మోటర్ల రిపేరింగ్ నేర్చుకున్నా. ఆయనే నా గురువు. మొదట్లో నట్లు, బోల్టులు సరిగా పట్టుకోలేకపోయేవాడిని, దాంతో ఒక దెబ్బ వేసి పని నేర్పించారు. ఇప్పుడనిపిస్తుంది ఆయనే నాకు దేవుడని. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే అది ఆయన చలువే’’అని రాజయ్య చెప్పారు.

అవివాహితుడైన రాజయ్య ది ఒంటరి జీవితం. ఆయనకు పెంకుటిల్లు ఉంది. మాణిక్యాపూర్‌తో పాటు పక్కనే ఉండే రత్నగిరి, అమ్మనగుత్తి, కాట్రపల్లి గ్రామాల్లో వ్యవసాయ బావుల్లోని పంపు సెట్లు ఆయన మరమ్మతు చేస్తుంటారు.

రాజయ్య అంధుడు అని ధృవీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్

మాణిక్యాపూర్‌లో సాగునీటికి ప్రధాన ఆధారం వ్యవసాయ బావులు. ఇక్కడ సుమారు 300 వరకు వ్యవసాయ బావులు ఉన్నాయి. బావి నీటిని తోడేందుకు స్థానిక రైతులు విద్యుత్ పంప్ సెట్లు వాడతారు. ప్రధాన పంట వరి కావడంతో ఎక్కువగా నీరు అవసరమవుతుంటుంది.

''గతంలో భూగర్భ బోర్లు వేసినా నీరు రాలేదు. దాంతో గ్రామంలో ఎక్కువగా వ్యవసాయ బావులు తవ్వారు. నేడు భూగర్భ జలాలు కాస్త పెరిగాయి’’అని మాణిక్యాపూర్ సర్పంచ్ వేల్పుల రవీందర్ ఇంత పెద్ద సంఖ్యలో వ్యవసాయ బావులు ఉండటం వెనుక కారణం వివరించారు.

''రాజయ్య తన ఖర్చులకు తానే సంపాదించుకుంటారు. ఇతరులపై ఆధారపడడు. ఆయనే వంట చేసుకుంటారు. బట్టలు ఉతుక్కుంటారు. మాణిక్యాపూర్ చుట్టుపక్కల ఊర్లకు ఆయన కావాల్సిన మనిషి’’అని మాణిక్యాపూర్ గ్రామస్థుడు మొగిలి అన్నారు.

చూపు లేని రాజయ్య మోటార్ రిపేర్లు ఎలా చేస్తారు?

మాణిక్యాపూర్ గ్రామ పరిధిలో ఎవరి సహాయం లేకుండానే రాజయ్య వ్యవసాయ బావుల వద్దకు నడిచివెళ్తారు. అలా వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోరు.

''చెప్పులు కొనడానికి డబ్బులు లేక కాదు. చెప్పులు వేసుకుంటే దారి సరిగా తెలియదు. అది నాకున్న సమస్య. కాలి స్పర్శతోనే నలుగురు తిరిగే దారేనా కాదా అన్నది గుర్తిస్తా’’అని ఆయన చెప్పారు.

చెప్పులు లేకుండా మా ఊరి పరిధిలో ఒంటరిగా ఎంతదూరమైనా పోతాను అని రాజయ్య చెప్పారు. తను వ్యవసాయ మోటార్లు రిపేర్ ఎలా చేయగలుగుతున్నారో కూడా వివరించారు.

''వర్షాలు బాగా కురిసి మోటార్లు వ్యవసాయ బావిలో మునిగిపోయినా, రిపేర్లు వచ్చినా రైతులు కబురు చేస్తారు. మా ఊర్లో (మాణిక్యాపూర్) పొలాల వద్దకు ఒంటరిగానే నడిచి పోతాను. పక్క గ్రామాల వారు అయితే, స్వయంగా వచ్చి తీసుకెళ్లడమో లేదా నేను ఆ గ్రామానికి ఆటో, బస్సులో వెళ్తే.. అక్కడ పికప్ చేసుకోవడమో జరుగుతుంది’’అని ఆయన తెలిపారు.

''వ్యవసాయ బావి లోపల మోటార్ అమర్చిన లోతు వరకు రైతులే తాడు వేస్తారు. ఆ తాడు సహాయంతో బావిలోకి దిగి మైనర్ రిపేర్లు అయితే అక్కడే చేస్తాను. పెద్ద రిపేర్లు అయితే బావిలో నుండి పైకి లాగేందుకు వీలుగా మోటార్‌కు తాళ్లు కట్టి వస్తాను. అలా ఆ మోటార్‌ను పరీక్షించి వైండింగ్ లాంటివి అవసరమైతే నా ఇంటి దగ్గర చేస్తాను. ఇంకా పెద్ద సమస్య అయితే దగ్గర్లోని హుజూరాబాద్‌లోని వేరే మెకానిక్‌ల దగ్గరికి తీసుకెళ్లమని సూచిస్తాను’’అని ఆయన వివరించారు.

రాజయ్య చదువుకోలేదు. ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ పంపు సెట్ మోటార్ల పని అంతా అనుభవంతో నేర్చుకున్నదే. 50 ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తున్నారు. ఇలా రిపేర్లు చేయగా వచ్చే డబ్బులు, ప్రభుత్వం నుండి వచ్చే వికలాంగుల పింఛనే ఆయన ఖర్చులకు ఆధారం.

''గ్రామంలో అందరితో బాగుంటాను. రిపేర్లకు వెళ్లినప్పుడు ఇన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయను. ఊరి వారు కూడా నాతో బాగుంటారు. నేనెప్పుడైనా పొరపాటున దారి తప్పితే ఇంటి దగ్గర దిగబెడతారు. నా జీవితం ఇలా గడుస్తోంది’’ అంటారు రాజయ్య.

తోటి వికలాంగుల కోసం సంఘం

వికలాంగుడిగా బాల్యం నుండి తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో మాణిక్యాపూర్‌లో 'వెంకటేశ్వర వికలాంగుల సంఘం’ ప్రారంభించారు రాజయ్య. ప్రస్తుతం గ్రామంలోని పది మంది సభ్యులతో ఈ సంఘం నడుస్తోంది.

ఈ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు నెలకు వంద రూపాయలు పొదుపు చేస్తారు. ఈ పొదుపు డబ్బులను అవసరమైన సభ్యులకు తక్కువ వడ్డీతో లోన్‌గా ఇస్తారు.

'’నాకు కళ్లు కనిపించవని అప్పు ఎవరూ ఇవ్వరు. అందుకే రాజయ్య సూచనపై కాళ్లు, చేతులు లేని వారమంతా ఒక్కటై సంఘం పెట్టుకుని బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాం. అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులను వాడుకుంటున్నాం. పింఛను వచ్చినప్పుడు నెలనెలా వాయిదాలు చెల్లిస్తున్నాం’’ అని సంఘ సభ్యుడు ఎంబాడి సారయ్య అన్నారు.

ఇలా ఈ సంఘం నుండి పొందిన రుణంతో గతంలో ఒక సభ్యుడు గేదె నుకొని పాలతో ఉపాధి పొందారు. మరొకరు ఇంటి నిర్మాణానికి ఉపయోగించారు.

'5వ తారీఖు వచ్చిందంటే సభ్యులందరితో చిట్టీ డబ్బులు కట్టిస్తున్నాడు. సంఘం వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో సంఘం ద్వారా కొందరికి ప్రభుత్వ పింఛను, రేషన్ కార్డ్ అందేలా చూశారు. ఇది చాలా మంచి పని. ఈయనకు కళ్లుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది’’అని సంఘ సభ్యుడు ఎంబాడి సారయ్య కొడుకు ఎంబాడి అంజి వివరించారు.

''వికలాంగులకు అప్పు ఎవరు ఇస్తారు? అందుకే స్వయం సహాయక మహిళా సంఘాల మాదిరిగా వికాలాంగుల సంఘం పెట్టుకున్నాం. ప్రస్తుతం మా దగ్గర లక్షన్నర రూపాయల పొదుపు డబ్బులు ఉన్నాయి’’అని రాజయ్య గర్వంగా చెబుతారు.

భవిష్యత్తు గురించి బెంగ లేదు

తన ఇంట్లో ఉన్న టీవీలో తీరిక సమయంలో రాజయ్య సినిమాలు పెట్టుకుంటారు. ఎవరైనా కోరితే, తన బాల్యంలో నేర్చుకున్న రామాయణ పద్యాలు, మాయల ఫకీర్ నాటక డైలాగ్‌లు వినిపిస్తారు.

''అక్కినేని నాగార్జున నా అభిమాన హీరో. ఆయన సినిమాల్లో కథ బాగుంటుంది. టీవీలో బొమ్మ చూడలేకపోయినా డైలాగ్స్ వింటాను. నా బాల్యంలో గ్రామానికి వచ్చిన రామాయణ నాటకం బృందంలో తబలా ఎలా వాయిస్తున్నాడో చెవులతో విని.. చేయి ఎలా, ఎంత వ్యవధిలో తబలాను తాకుతుందో పక్కనే ఉండి గమనించాను. ఆ తర్వాత ఆ తబలా వాయిద్యకారున్ని బతిమాలి తబలా నేర్చుకున్నా. ఊర్లో నిర్వహించే పండగలు, ఉత్సవాల్లో తబలా వాయిస్తూ పాటలు, పద్యాలు పాడుతాను’’అని రాజయ్య చెప్పారు.

''చూపు లేదని ఒక్కోసారి బాధ అనిపించినా ఆ బాధ తాత్కాలికమే. ఇప్పుడైతే ఐదో పదో సంపాదిస్తున్నాను. ఎప్పుడో జరగబోయే దానిగురించి ఇప్పుడు ఆలోచించడం ఎందుకు?’’అని రాజయ్య అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana: 'I have lost my sight.. I am living by begging.. What have I been doing for 50 years..'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X