వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: మృతుడిని బతికిస్తానని వ్యక్తి పూజలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మూఢ నమ్మకాలు

తెలంగాణ జగిత్యాల జిల్లాలో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, దానిని అడ్డుకున్నందుకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతోనే గొడవపడ్డారని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్‌కు చెందిన ఒర్సు రమేశ్, అనిత భార్యాభర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు.

15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవపడ్డారు. రాజు ఆ సమయంలో నీ అంతు చూస్తానంటూ రమేశ్‌ను బెదిరించాడు.

కొద్దిరోజుల తర్వాత రమేశ్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్‌ మృతిచెందాడు.

కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేశ్‌ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు ఆ దంపతులను కట్టేసి కొట్టారు.

వారి దెబ్బలు భరించలేక తానే చేతబడి చేశానని.., సగం చంపానని, క్షుద్రపూజ చేసి బతికిస్తానని రాజు చెప్పాడు.

దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజాసామగ్రి తీసుకొచ్చారు. పూజ చేసేందుకు పుల్లేశ్‌ దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు.

అయితే రమేశ్‌ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు.. పుల్లేశ్‌ మంత్రం వేస్తే రమేశ్‌ బతికి వస్తాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని సాక్షి రాసింది.

దేశీయ విమానం టికెట్ ధర పెంపు

దేశీయ విమాన ప్రయాణ టికెట్ల ధర పెంపు

దేశీయ విమానాల టికెట్‌ ధరలపై గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను పెంచుతూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత మే 25న విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాక ప్రయాణ సమయాన్ని బట్టి ప్రభుత్వం టికెట్ల ధరలపై పరిమితులు విధించింది.

కరోనా సంక్షోభంతో ఆదాయం కోల్పోయిన విమాన సంస్థలను ఆదుకోవడానికి కనిష్ఠ పరిమితి, డిమాండ్‌ ఎక్కువ ఉన్నప్పుడు ప్రయాణికులపై అధిక భారం మోపకుండా ఉండేందుకు గరిష్ఠ పరిమితి విధించింది.

వీటిని తాజాగా గరిష్ఠంగా 12.5% మేర సవరించింది. ఈ ధరలకు అదనంగా ప్రయాణికుల భద్రత రుసుము, విమానాశ్రయాల అభివృద్ధి రుసుము, జీఎస్టీలను చెల్లించాల్సి ఉంటుంది. సీట్ల భర్తీ పరిమితిని 65నుంచి 72.5 శాతానికి పెంచింది.

దేశంలో విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 57.25 లక్షల మంది విమానాల్లో ప్రయాణించగా, మే నెలలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి కారణంగా ఆ సంఖ్య 21.15 లక్షలకు పడిపోయింది.

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలో జూన్‌లో 31.3 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. జులైలో ప్రయాణికుల సంఖ్య ఏకంగా 50.07 లక్షలకు (61%) పెరిగింది. డీజీసీఏ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించిందని ఈనాడు వివరించింది.

వైఎస్ వివేకా కుమార్తె

'రక్షణ కల్పించండి'- వైఎస్ వివేకా కుమార్తె

తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత శుక్రవారం పోలీసులను కోరారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

''పులివెందులలోని మా ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారు. ఈ నెల 10న కూడా ఓ వ్యక్తి అనునామాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వారి ఉద్దేశం ఏమిటో మాకు తెలియదు. మా కుటుంబానికి రక్షణ కల్పించండి'' అంటూ కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత శుక్రవారం విన్నవించారు.

'మా కుటుంబ భద్రతపై ఆందోళనగా ఉంది. ఈనెల 10న సాయంత్రం 5.20గంటల సమయంలో ఓ వ్యక్తి మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా నేను పేర్కొన్న వ్యక్తుల్లో డి.శివశంకర్‌రెడ్డి ఒకరు. శివశంకరరెడ్డి అనుచరులు మా ఇంటిచుట్టూ అనుమానాస్పదంగా తిరగడం ఆందోళన కలిగిస్తోంది' అని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

తక్షణమే వారి ఇంటివద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయాలని, లేఖలో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించామని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ ఆదేశాల మేరకు వివేకా ఇంటివద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు సీఐ చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

భారత్ బయోటెక్ ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ట్రయల్స్‌కు అనుమతి

భారత్ బయోటెక్ తయారు చేసిన ముక్కులో వేసే డ్రాప్స్ ద్వారా కరోనా టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఫార్మా కంపెనీ.. ఇప్ప‌టికే కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను త‌యారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ టీకాను క‌రోనా రాకుండా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.

అయితే.. క‌రోనా వ్యాక్సిన్‌లో మ‌రో ముంద‌డుగు వేసింది భార‌త్ బ‌యోటెక్. ఇంజెక్షన్ల ద్వారా కాకుండా.. డైరెక్ట్‌గా ముక్కు ద్వారా వేసే క‌రోనా టీకాను త‌యారు చేసింది.

ఈ టీకాకు సంబంధించి రెండు, మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది.

ఈ వ్యాక్సిన్ పేరు.. BBV154. దీన్నే Adenoviral Intranasal Covid-19 vaccine అని పిలుస్తారు. నాజ‌ల్ వ్యాక్సిన్ అని కూడా అంటారు.

ఈ వ్యాక్సిన్ కోస‌మే.. భార‌త్ బ‌యోటెక్.. యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చ‌కుంది.

మొద‌టి ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా.. 18 నుంచి 60 ఏళ్ల వ‌య‌సు ఉన్నవారికి ఈ టీకాను ముక్కు ద్వారా ఇచ్చి టెస్ట్ చేశారు.

అది విజ‌య‌వంతం అయిన‌ట్టు కంపెనీ వెల్ల‌డించింది. వాళ్ల‌కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాక‌పోవ‌డంతో.. రెండు, మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అనుమతి కోసం భార‌త్ బ‌యోటెక్.. కేంద్రాన్ని కోర‌గా.. కేంద్రం ఓకే చెప్పింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లకు హ్యూమ‌న్‌ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌లేదు. మొద‌టిసారి హ్యూమ‌న్‌ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తి పొందిన వ్యాక్సిన్ ఇదేనని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Telangana: Man arrested for resurrecting dead, police arrested: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X