జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి - భక్తులకు దర్శనం..!!
జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. జమ్మూ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శేషాచల కొండల నుండి ఇక్కడికి విచ్చేశారని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉద్ఘాటించారు.
మహాసంప్రోక్షణ :
జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ ఆగమోక్తంగా జరిగింది. సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి, ఆ తరువాత కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణంతో మాతా వైష్ణోదేవి, అమరనాథ్, శారదాదేవి ఆలయాలతో పాటు స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు.

శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణం:
హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రముఖ నగరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరంలో ఇటీవల శ్రీవేంకటేశ్వర ఆలయాలను ప్రారంభించామన్నారు.
చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం నిర్మించామని, తిరుచానూరు తరువాత ఇది రెండోదని తెలిపారు. నవీ ముంబైలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 - 75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి జూన్ 7న భూమి పూజ చేశామన్నారు. టీటీడీ పెద్ద ఎత్తున శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తోందని చెప్పారు.
జమ్మూ ప్రజల కల సాకారం:శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని త్వరగా నిర్మించి జమ్మూ ప్రజల కలను సాకారం చేయడం వెనుక లెఫ్టినెంట్ గవర్నర్, టీటీడీ చైర్మన్, శ్రీమతి ప్రశాంతి రెడ్డి కృషిని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఆధ్యాత్మిక పుస్తకాల పంపిణీ, మతమార్పిడులు జరగకుండా వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణంతోపాటు వేదపాఠశాలలు, బధిర పాఠశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను టీటీడీ చేస్తోందన్నారు. బాలాజీ ఆలయ నిర్మాణాన్ని భిన్నత్వంలో ఏకత్వ వేడుకగా జితేందర్ సింగ్ అభిర్ణించారు.ఇక్కడి భక్తులను ఆశీర్వదించడానికి వేంకటేశ్వరుడు తిరుపతి నుండి జమ్మూ వరకు విచ్చేశారన్నారు.












Click it and Unblock the Notifications