లేడీ ఎమ్మెల్యేకి నోటీసులు, హైకోర్టులో ఏం జరిగింది, ఆస్తులు, విద్యార్హతలతో ఎన్నికల్లో పోటీ !
ఎమ్మెల్యేగా విజయం సాధించిన లేడీ ఎమ్మెల్యే అధికార పార్టీ అండతో చెలామణి కావాలని అనుకున్నారు. అయితే ఆరు నెలల కాకముందే ఆ లేడీ ఎమ్మెల్యేకి సినిమా కష్టాలు మొదలైనాయి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదే కర్ణాటకలోని కలబురగిలోని నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమాకు నోటీసులు ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాల్లోని వాస్తవాలను దాచిపెట్టారనే ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమాకు ఈ నోటీసు జారీ చేయబడింది. కనీజ్ ఫాతిమాపై జేడీఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శరణ్‌బసప్ప ఎన్నికల వివాద పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.

హైకోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి పిటిషన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులైన ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా, చంద్రకాంత్, నాసిర్ హుస్సేన్, మెహబూబ్ షా, సయ్యద్ సజ్జాద్ అలీ, అబ్దుల్ హాజీ మహ్మద్, తారాభాయ్ భోవి, మహ్మద్ అష్రఫ్, అబ్దుర్ రహీమ్, అబ్దుల్ హమీద్ బగాబాన్, ముజాహిద్ రవూఫ్ మజారి రవూఫ్‌లకు నోటీసులు జారీ చెయ్యాలని ఆదేశించింది.
నోటీసులను అమలు చేయాలని సంబంధిత అధికారులకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా కనీజ్ ఫాతిమా తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపేందుకు సమయం కావాలని కోరారు. దీనిని అంగీకరించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. పిటిషనర్ దరఖాస్తులో అభ్యంతరం ఏమిటి అనే విషయంపై చర్చ మొదలైయ్యింది.
2023 మే 10వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరడంతో అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కనీజ్ ఫాతిమా కలబురగి నార్త్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఫాతిమా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో స్థిరాస్తి, వాటాలు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాల్లో వాస్తవ వివరాలు ఇవ్వలేదని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. అందువల్ల ఫాతిమా ఎన్నికను రద్దు చేయాలని, తన సమీప ప్రత్యర్థిగా రెండవ అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టుకు మనవి చేశారు. మొత్తం మీద కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఇప్పుడు హైకోర్టు నుంచి నోటీసులు అందడంతో ఆమె చట్టపరంగా ఎలా కేసును ఎదుర్కొంటారో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications