దెబ్బతో ఊహించని షాక్ కు ఇచ్చిన అప్ప వర్గం, సంతోష్ కు సంతోషం మాయం !
బెంగళూర/న్యూఢిల్లీ: బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి వీ. సోమన్న బహిరంగంగానే లాబీయింగ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీని బలోపేతం చేసేందుకు తాను కచ్చితంగా సరిపోతానని మాజీ మంత్రి సోమన్న బహిరంగంగా చెప్పారు. ఈ మేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖ కూడా రాశారు. సోమన్న ఎంట్రీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ తో పాటు ఆయన వర్గీయులు షాక్ తిన్నారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి నేను పోటీలో ఉన్నానని, తనకే ఆ పదవి ఇవ్వాలని మాజీ మంత్రి సోమన్న డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దెబ్బకు బీఎల్. సంతోష్ వర్గంలోని బీజేపీ నేతల కళ్లు తిరుగుతున్నాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఇప్పటికే ఎంపీ, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నలిన్‌కుమార్ కటీల్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సోమన్న శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తన ఆకాంక్ష గురించి పార్టీ హైకమాండ్ నేతలకు లేఖ రాశానన్నారు. నన్ను అధ్యక్షుడిని చేసిన తర్వాత 100 రోజుల్లోగా నన్ను పరీక్షించాలని పెద్దలను కోరాను. పార్టీ కార్యాచరణలో సమూల మార్పులు తీసుకువస్తానన్న నమ్మకం నాకుంది. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉందని సోమన్న అన్నారు.

రాజకీయాల్లో తనకు 45 ఏళ్ల అనుభవం ఉంది. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని సోమన్న అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించగా పలువురు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ, మాజీ మంత్రి వి.సునీల్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ. రవి పేర్లు వినిపించాయి. అయితే మధ్యలో ఎంట్రీ ఇచ్చిన సోమన్న బహిరంగంగానే తనకు బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

తాను బీజేపీలోకి వచ్చి 15 ఏళ్లు కావస్తోంది. పార్టీ కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేశాను. బీజేపీ హైకమాండ్ చెప్పిన ప్రతిపని చేశాను, బెంగళూరులోని గోవిందరాజ్‌నగర్ నుంచి కాకుండా వరుణ, చామరాజనగర్ నియోజక వర్గాల నుంచి పోటీ చెయ్యలని హైకమాండ్ చెబితే తాను పోటీ చేసి ఓడిపోయాను. వరుణ, చామరాజనగర్ లో పోటీ చెయ్యాలని హైకమాండ్ చెబితేనే తాను పోటీ చేశానని, నా రాజకీయ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే తనకు బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇవ్వాలని సోమన్న డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సోమన్న బహిరంగంగానే తాను పోటీలో ఉన్నానని చెప్పడంతో బీఎల్. సంతోష్ వర్గీయులు హడలిపోయారు. ఈనేపథ్యంలో బీజేపీ హైకమాండ్ చర్చలు కొనసాగిస్తున్నదని తెలిసింది. వీ. సోమన్నను కాదని మరెవరికైనా అధ్యక్ష పదవి ఇస్తే లింగాయత్‌లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది బీఎల్. సంతోష్ వర్గానికి చెందిన వారే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో వేచి చూడాలి అంటున్నారు బీజేపీ నాయకులు.












Click it and Unblock the Notifications